Salaries pending | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 11 : ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రలోకి జారే వరకు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం, తమకు మాత్రం గౌరవ వేతనం సక్రమంగా అందజేయటం లేదని, నెలల తరబడి తమకు వేతనాలు రాక కుటుంబాలు పస్తులుండే స్థితికి చేరుతున్నాయని, జిల్లా అధికారులే తమను ఆదుకోవాలంటూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రిపోర్స్ పర్సన్స్ గా విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళలు ప్రజావాణిలో అధికారులను వేడుకున్నారు. తామెంతో కష్టపడుతున్నా తమకు అందించేది కేవలం రూ.8వేల గౌరవ వేతనమే అయినా, అది కూడా ఆరు నెలలుగా అందకపోవటంతో తమ బతుకు చిత్రం మారుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చే నామమాత్రపు వేతనానికి 24 గంటల పాటు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, కుటుంబ పోషణ కోసం అధికారుల వేధింపులను తట్టుకుని పనిచేస్తున్నా తమను కనీసం మనిషిగానైనా గుర్తించటం లేదంటూ వాపోయారు. అనంతరం ఆడిటోరియం ఎదురుగా రిసోర్స్ పర్సన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీత మాట్లాడుతూ, గత మార్చి నుంచి ఇప్పటివరకు నెలసరి గౌరవవేతనం విడుదల చేయలేదని ఆరోపించారు. కులగణన సర్వే డబ్బులు కూడా ఇప్పటివరకు జమచేయలేదని విమర్శించారు.
విధుల నిర్వహణలో నిత్యం అధికారుల వేధింపులుతప్పడం లేదని వాపోయారు. జీవోనెం. 184 ప్రకారం విఎల్ఆర్ స్త్రీనిధి, లోకల్ బాడీ నిధుల నుంచి ఆర్పిలకు గౌరవవేతనం అందజేయాలనే నిబంధన తొలగించాలని డిమాంద్ చేశారు. వివోఎల మాదిరి ప్రత్యేక నిధులు కేటాయించి, చర్చ్ ద్వారా గౌరవ వేతనాలు పంపిణీ చేయాలన్నారు. వివోలకు వర్తింపజేసిన విధంగా పిఆర్సి ఆర్పిలకు కూడా అమలు చేయాలని, కనీస గౌరవ వేతనం రూ.28 వేలకు పెంచాలని, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలక్టర్ను కలిసిన వారిలో జిల్లా నగరంలోని పలు డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న ఆర్పిలు ఉన్నారు.
దివ్యాంగ ఉద్యోగుల పట్ల అధికారుల నిర్లక్ష్యం: వెన్నం శ్రీనివాస్, దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలోని దివ్యాంగ ఉద్యోగుల పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రతి ఏడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రభుత్వోద్యోగులకు అందించే ప్రశంసాపత్రాలు దివ్యాంగ ఉద్యోగులకు కూడా అందజేయాలని, నేను కలెక్టరుకు వినతిపత్రం అందజేశాను. దీనిని స్పందించిన కలక్టర్ ఈసారి అందజేసే ప్రశంసాపత్రాల పంపిణి జాబితాలో దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాలంటూ ఆదేశాలు రాజీ చేసింది. మంగళవారం నాటికే ధరఖాస్తుల గడువు ముగుస్తుండగా, తమ కోసం విడుదల చేసిన సర్కులర్లో మాత్రం ధరఖాస్తులు చేసుకునే చివరి తేదీని మర్చిపోవటం దారణం. తమకు ప్రశంసాపత్రాలు వస్తాయనే సంతోషంలో ఉండాలో.. లేక చివరితేదీ ఎప్పుడో తెలియక తికమక పడాలో అధికారులే చెప్పాలి.
భూ హద్దులు నిర్ణయించాలి : గుర్రం శంకరయ్య, వెంకటాయపల్లి
మాగ్రామంలోని సర్వేనెం. 138లో తనకుండబడిన 8గుంటల భూమిని సర్వే చేయాలంటూ, ఆరు మాసాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా, వాళ్ళు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదేమిటని అడిగితే సీరియల్ నెంబర్ ప్రకారం చేస్తామంటూ సర్వేయర్ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో, కలెక్టరు నా గోడు చెప్పుకుని తొందరగా పరిష్కరించాలని కోరేందుకు ప్రజావాణికి వచ్చాను.
ప్రజావాణిలో 231 ఫిర్యాదుల స్వీకరణ
కలెక్టరేట్ అడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాలనుంచి వచ్చిన 231 మంది అర్జీదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశౠరు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాడే, డిఆర్వో వెంకటేశ్వర్లు వారి వద్ద నుంచి అర్జీలు తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలంటూ ఆయా విభాగాల అధికారులకు వాటిని బదలాయించారు.