Korutla | కోరుట్ల, ఏప్రిల్ 14: కోరుట్లలో రౌడీషీటర్ల వసూళ్ల పర్వం కలకలం రేపింది. పట్టణానికి చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకొని కటకటాలకు తరలించారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సురేష్ బాబు వెల్లడించారు. కోరుట్లలో గత కొద్ది కాలంగా పట్టణంలోని కొంతమంది వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అనే రౌడీ షీటర్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.
నాగరాజుపై గతంలో రెండు మర్డర్ కేసులతో పాటూ ఇతర కేసులు ఉన్నాయని, పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నాగరాజుకు మరో నిందితుడు సహకారం అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతను పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఈకేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని బలవంతపు వసూళ్లకు పాల్పడినా ముఠాలో ఎవరు ఉన్న పట్టుకొని తీరుతామన్నారు. విత్తనాల నాగరాజుతో అతని సహచరులతో సంబంధాలు కలిగి ఉండేవారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. రౌడీషీటర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని, మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసులకు సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. ఇక్కడ కోరుట్ల ఎస్ఐ చిరంజీవి ఉన్నారు.