భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. అరకొర పనులు చేపట్టి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 11 : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో భూగర్భ జలాలను పెంచాలన్న ఉద్దేశంతో స్మార్ట్‌సిటీ నిధులతో రూప్‌టాప్ వర్షపునీటి సంరక్షణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, స్థలాల్లో కొత్త పద్ధతిలో వీటిని చేపట్టాలని నిర్ణయించి 7 కోట్లు కేటాయించారు. 50 ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని, ఆ మేరకు టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో నాన్ వోన్ జియో టెక్స్టైల్ వాడడంతోపాటు గుంతలో బోర్ కూడా వేయాల్సి ఉంటుంది.
దీని ద్వారా వర్షపునీరు భూమిలోకి వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టాలి. కానీ, ఈ పనుల విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఈ గుంతల్లో 400 జీఎస్ఎం మందం ఉండే ఫైబర్ టెక్స్టైల్ వాడాల్సి ఉన్నా తక్కు వాడారని, అయినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే, ఈ గుంతల లోతు విషయంలోనూ నిబంధనల మేరకు తవ్వకాలు చేయలేదని మాజీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు.
పనులు పూర్తి చేయకుండానే చేసినట్లు రికార్డు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పనులు జరుగుతున్నప్పుడు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా అవేవీ చేయకుండానే సంతకాలు చేశారని తెలుస్తున్నది. నగరంలో ఇప్పటి వరకు 30 ఇంకుడు గుంతల నిర్మాణం చేసినట్లు అధికారవర్గాలు చెబుతుండగా, వీటిల్లో అత్యధిక పనుల్లో నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులు కుమ్మకై నిధులను దండుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.