Siricilla | సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 4 : రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని డీటీవో శ్రీనివాస్‌రావు సూచించారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీఓ శ్రీనివాస్ రావు, డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి స్లైడ్ల ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ వాహనం నడిపే ముందు సాంకేతిక తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే అలసట లేదా నిద్రమత్తుతో వాహనం నడపకూడదని, వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న అధికారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రయాణికుల ప్రాణాల రక్షణే ప్రతీ డ్రైవర్ ప్రధాన బాధ్యత అని, సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదరహిత ప్రయాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వంశీధర్ ఏ ఎంవీఐ పృథ్వీరాజ్ వర్మ, సాగర్, నిఖిల్, సిరిసిల్ల, వేములవాడ డీఎంలు ప్రకాష్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.