police custody | కోల్ సిటీ , మే 9: రామగుండం నగర పాలక సంస్థలో రోడ్డు ధ్వంసం సంఘటన వివాదాస్పదంగా మారింది. నగర పాలక పరిధిలోని కృష్ణానగర్ లో ఇటీవల నూతనంగా నిర్మించిన రోడ్డును ఓ కాంట్రాక్టర్ ధ్వంసం చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. మునుపెన్నడూ లేనివిధంగా జరిగిన ఈ సంఘటనతో నగర పాలక అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐతే అధికారుల తప్పిదమా..? లేక కాంట్రాక్టర్ పొరబాటా? తెలియదు కానీ ఆ రోడ్డు ధ్వంసం చేసిన పాపానికి కాంట్రాక్టర్ శిక్ష అనుభవించాల్సి వస్తుండటం గమనార్హం. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్ణానగర్ ఏరియాలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఓ కాంట్రాక్టర్ ఇతర పనుల నిమిత్తం తవ్వించాడు.
అటుగా వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధి ఈ ధ్వంసంపై ఆరా తీయగా సదరు కాంట్రాక్టర్ తవ్వించాడని తెలియడంతో పిలిపించి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఐతే రోడ్డు ధ్వంసంకు కారణమైన వారికి రూ.5లక్షల వరకు జరిమానా విధించాల్సిందేనని ఆదేశించినట్లు తెలిసింది. దీనితో ఎన్టీపీసీ పోలీసులు సదరు కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే నగర పాలక సంస్థ నీటి విభాగం ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లనే ఆ రోడ్డు తవ్వినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీ ని వివరణ కోరగా, రోడ్డు ధ్వంసం మాట వాస్తవమేననీ, సదరు కాంట్రాక్టర్ వద్ద నుంచి వాంగ్మూలం తీసుకొని తదుపరి చర్యల నిమిత్తం కలెక్టర్ కు నివేదిక పంపించడం వరకే తన బాధ్యత అని పేర్కొన్నారు.
చట్ట పరంగా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే పోలీస్ శాఖ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటన రామగుండం కార్పొరేషన్లో జరగడం ఇదే మొదటిసారి కావడంతో నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అటు నగర పాలక ఇంజనీరింగ్ విభాగం అధికారులు సైతం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో రామగుండం మెజార్టీ వర్గాల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి కను సన్న లో ఇదంతా నడుస్తుందని నగరం అంతా జోరుగా చర్చ జరుగుతుంది.