మల్యాల, మే 28 : మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి! ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు, వానకాలం సీజన్‌కు ముందే సర్కారు పిడుగు లాంటి వార్త చెప్పింది. రైతు భరోసా సకాలంలో ఇవ్వకుండా వేధిస్తుండగా, తాజాగా మరో భారం మోపింది. అసలే పెట్టుబడికి తంటాలు పడుతుండగా, పచ్చిరొట్ట విత్తనాల ధరలను భారీగా పెంచింది. తమ వ్యవసాయ భూములలో సారవంతం కోసం ఈ విత్తనాలను చల్లుకుని, ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నుకుంటారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లిపెసర వంటివి ప్రభుత్వం రోహిణీ కార్తెకు ముందే ఏటా సబ్సిడీపై అందజేస్తుంది. ఈసారి కాంగ్రెస్ సర్కారు యాసంగి రైతుభరోసా పూర్తిగా విడుదల చేయకుండానే పచ్చిరొట్ట విత్తనాల ధరలు పెంచి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ రెండేళ్లలోనే రెండున్నర రెట్లు పెంచి రైతుల నడ్డి విరిచింది.
యాభై శాతం సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నా, సీజన్‌కు ముందే విత్తనాల ధరలను పెంచడంతో రైతులపై ప్రభావం పడనున్నది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందజేసేందుకు సన్నద్ధమవుతున్నప్పటికీ ఆన్లైన్ ద్వారానే మండల వ్యవసాయాధికారి నుంచి పర్మిట్ పొంది విత్తనాలను పొందాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ విధానంలో ఆన్లైన్ సరిగా పనిచేయకపోతే యూరియా యాప్ తరహా మాదిరిగానే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.