Karimnagar | కలెక్టరేట్, మార్చి 2 : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం బాధితులు పోటెత్తారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న 345 మంది జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి తమ బాధలు చెప్పుకోగా, అధికారులు విని వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, అత్యధిక మంది కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అధికారుల నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ళకేళ్ళుగా సాగుతున్న సమస్యలపై కలెక్టర్‌కు విన్నవించుకుంటూ తమ ఆవేదన వెళ్ళగక్కారు. బాధితులను శాంతపరిచి ఏళ్ళ నాటి ఇబ్బందులను కూడా పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇచ్చిన ఫిర్యాదులననుసరించి ఆయా సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి, మరోసారి ఇబ్బందులెదుర్కోకుండా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఉద్యోగమిప్పిస్తే.. కుటుంబాన్ని పోషించుకుంటా : వేముల వేణు, దివ్యాంగ పట్టభద్రుడు, మందులపల్లి
పుట్టు వికలాంగుడినైన తనకు రెండు కాళ్ళు సక్రమంగా పనిచేయవు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఆస్తులు నాకు చెందలేదు. ఆరేళ్ళ క్రితం వెళ్ళి కాగా, ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఒకరు ఐదేళ్ళు, మరొకరు ఆరునెలల పాప కేవలం పెన్షన్ తప్ప ఎలాంటి ఆస్థిపాస్థులు లేవు. కుటుంబ పోషణ భారంగా మారింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కంప్యూటర్ లో పీజిడిసిఏ కూడా చేశాను. ఏదైనా ఉద్యోగం కోసం గత రెండేళ్ళ నుంచి ప్రజావాణిలో దరఖాస్తులు పెడుతున్నా. ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలవటంతో దరఖాస్తు చేశాను. వారధి ద్వారా భర్తీ చేస్తారని తెలియటంతో ప్రజావాణిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన. నాకు తాత్కాలిక ఉద్యోగం ఇప్పించి కుటుంబాన్ని పోపించుకునే అవకాశం కల్పించాలి.
వికలాంగుల పెన్షన్ కోసం ఏడాదిగా తిరుగుతున్న : సావనపల్లి మొండయ్య, దివ్యాంగుడు, ఒద్యారం, గంగాధర
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా కుడికాలు తొలగించారు. నాకు ఎలాంటి స్థిర, చరాస్థులు లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం మాది. రోజు కూలీ పనిచేస్తేనే పొట్టనిండేది. 50ఏళ్ళ వయసున్న నేను కూలీ పనికి కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నా వికలాంగుల పెన్షన్ కోసం ఏడాది కింద ధరఖాస్తు చేసుకున్న 85 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న నాకు ఇప్పటివరకు పెన్షన్ రావటం లేదు. ఎంపిడివో ఆఫీసుల అడిగితే డిఆర్ డిఏ ఆఫీసుకు వెళ్ళమంటున్నరు. అక్కడికి వెళ్ళే ఎంపిడివోను కలువమంటున్నరు. డిఆర్డిఏలోనే నా ధరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నరు. నా పరిస్థితి గమనించి వికలాంగుల పెన్షన్ మంజూరీ చేయించి, నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
ఉద్యమకారులకిచ్చిన హామీలు నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారులు, కరీంనగర్ జిల్లా
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, స్వరాష్ట్ర సాధన కోసం మావంతు కృషి చేశాము. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకందించే వసతులను మెనిఫెస్టోలో పొందుపర్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ ప్రకటించింది. పాలనాపగ్గాలు చేపట్టి రెండేళ్ళు గడిచినా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25వేల పెన్షన్ అందజేస్తామని ఆరు గ్యారెంటీల్లో ఒకటిగా ప్రకటించింది. వివరాలు సేకరించింది ఇటీవల నిజామాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉద్యమకారుల హామీల అమలును ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసుల్లో ఇరుక్కుపోయాము. కేసులు కూడా రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మర్చిపోయింది. కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు కూడా లేక అనేక ఇబ్బందులనెదుర్కొంటున్నాం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, ఉద్యమకారులను ఆదుకోవాలి.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న ఏవో పట్టించుకోవటం లేదు : నీల శ్రీనివాస్, కంకల సంతోష్, కూచనపల్లి గణేష్ కూచననపల్లి కుమారస్వామి, రెడ్డి రాజుల సంపత్, వీణవంక రైతులు
గతకొద్ది నెలలుగా గ్రామంలో వ్యవసాయ ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న ఏవో పట్టించుకోవటం లేదు. ఏవో గణేష్ దుకానదారులతో కుమ్ముక్కయ్యాడు. రైతులకు అందుబాటులో ఉండకుండా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వ్యనసాయ దారులను పట్టించుకొవడం లేదు. వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ధరఖాస్తులు స్వీకరించకుండా, వాటి సమస్య పరిష్కారం చేయకుండా చాలా భాదలకు గురి చేస్తున్నాడు. యూరియా డి.ఏ.పి, ఇతర ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రైతులు గత డిసెంబర్ నెలలో డి.ఏ.పి విషయంలో ధర 1350 ఉండగా రూ. 1450 ర అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదు. అత్యవసరమై ఫోన్ చేసినాఎత్తడం లేదు. నిర్లక్ష్యపు సమాధానం ఇస్తాడు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంపై చర్యలు తీసుకోవాలి : వీణవంక రైతులు
వీణవంకలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణం పై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అండర్ టెక్ చేసి నడిపిస్తున్న ఆగ్రో సేవా కేంద్రం లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా, ప్రైవేట్ దుకాణం లాగా రైతులు ఎరువులు కొన్నప్పుడు రసీదులు ఇవ్వకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. యూరియా విషయంలో 80 సంవత్సరాలు వృద్ధులను ఇబ్బందుల గురిచేశాడు. ధరల పట్టిక ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ప్రతి ఎరువుల దుకాణం ముందు ఎరువులపై ఫిర్యాదుదారులు చేయడానికి ఫోన్ నెంబర్ తో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించిన పట్టించుకోవడం లేదు. ఏవో కు ఫిర్యాదు చేసిన దిక్కున చోటు చెప్పుకోండి, నాకేం కాదని అంటున్నాడు.