వేములవాడ, మే 11 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో విప్లవాత్మమైన మార్పులు వచ్చాయని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్‌లో బస్తీ దవాఖానను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దేశంలోనే ఎకడా లేని విధంగా జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల ప్రారంభమవుతుందని చెప్పారు. వేములవాడలో కూడా 100 పడకల దవాఖాన ఏర్పాటు చేసుకున్నామని, కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
ప్రభుత్వ దవాఖానలో 60 శాతానికి పైగా కాన్పులు జరుగడమే స్వరాష్ట్రంలో వైద్య సేవలు మరింత చేరువయ్యాయనడానికి నిదర్శనమన్నారు. వేములవాడ నియోజకవర్గంలోనూ 16 సబ్ సెంటర్లు మంజూరయ్యాయని చెప్పారు. బస్తీ దవాఖానతో పట్టణ ప్రజలు, రాజన్న భక్తులకు మరింత మెరుగైన వైద్య సేవలందుతాయన్నారు. 13 లక్షలతో ఈ బస్తీ దవాఖానను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, డీఎంహెచ్‌వో ఆవుల సుమన్ మోహన్ రావు, కమిషనర్ అన్వేశ్, వైద్యాధికారులు దివ్యశ్రీ, రవీందర్, సూపర్వైజర్ ఝాన్సీరాణి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఉన్నారు.