జగిత్యాల, ఏప్రిల్ 17: కేసీఆర్ సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పేరిట రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సభతో రేవంత్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’ అని తెలంగాణ సమాజం కోరుకుంటుందన్నారు. జగిత్యాల సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభ విజయవంతమై.. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పునాది పడుతుందని స్పష్టం చేశా రు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన జగిత్యాలలో జనహిత సభా స్థలాన్ని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ధర్మపురి ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, సభ ఇన్చార్జిలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 20న కేసీఆర్ సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నాడన్నారు. రెండున్నరేళ్లుగా కాళేశ్వరం కూలేశ్వరం అంటూ.. స్పీచ్‌లు ఇచ్చి కావాలని నాలుగు పంటలకు నీళ్లివ్వకుండా రైతుల పొట్టకొట్టారన్నారు. ఆలస్యమైనా కాళేశ్వరం తెలంగాణకు దిక్కు అని వారికి తెలిసిందన్నారు. ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే, దీనికి పోటీగా సీఎం లాంటి వ్యక్తి బహిరంగ సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
కౌన్సిలర్, సర్పంచ్ స్థాయిలో సంకుచిత బుద్ధితో ఆలోచిస్తున్న వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున సభకు వచ్చే ప్రజల కోసం మంచినీరు, మజ్జిగ, పార్కింగ్ వంటి అన్ని వసతులను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వొద్దినేని హరిచరణ్‌రావు, లోక బాపురెడ్డి, దావ సురేశ్, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, అయిల్నేని వెంకటేశ్వర్రావు, గంగారెడ్డి, శీలం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.