Putta Madhukar | మంథని, ఏప్రిల్ 5: ఊర్లళ్లో తిరిగే తుపాకీ రాముడికి ఉన్న గుర్తింపు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డికి లేదని, రేవంత్‌రెడ్డికి ఆయన పార్టీ నాయకులే గుర్తింపు ఇవ్వకుండా అసభ్యకరంగా మాట్లాడుతుండటం నిజంగా సిగ్గు చేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని రాజగృహలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డిని అవమానించిన తీరు ప్రజలు మరిచి పోవడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులే రేవంత్‌రెడ్డిని అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం నిజంగా సిగ్గు చేటన్నారు. మంథని నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పేరు వినిపించకుండా చేస్తున్నారన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏదో మూలన చిన్నగా తలకాయ కూడా కన్పించుండా ఆయన ఫొటోను మొక్కుబడిగా పెడుతున్నారన్నారు.
మంథనిలో శ్రీధర్‌బాబుది నిరంకుశ పాలన
మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు నిరకుంశ పాలన కొనసాగిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్యాంపు కార్యాలయానికి కట్టిస్తే అక్కడ ఉన్న శిలా ఫలకాన్ని తొలగింపు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాల కాలం దాటినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడ అమలు చేయడం లేదన్నారు. రైతులకు రైతు బంధు లేదు.. విద్యార్థులకు భరోసా లేదు.. దివ్యాంగులు, వితంతువులు, వృధ్ధులకు పెన్షన్ లేదు.. ఇలా ఒక్కటి కాదు రెండు 6 గ్యారెంటీలతో 420 హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులు, ఎమ్మెల్యేలను నానా తిట్లు తిడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు హరీష్‌రావు, కేసీఆర్, మహిపాల్‌రెడ్డి కార్యాలయాలపై దాడులు చేయించడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆరెస్టు చేయించడం వంటి నీచ వ్యవహారాలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకోవడం కాకుండ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి సొంత పార్టీ నాయకులతో గౌరవం పొందడంతో పాటు ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల సమయం గడిచినా కూడ ఇప్పటికీ కేసీఆర్ పేరు.. ఆయన మాట ప్రజల గుండెల్లో నుంచి పోవడం లేదన్నారు. అంత గొప్ప నాయకుడిని.. ఆ పార్టీని తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డిలు బదునాం చేయాలని చూస్తే ప్రజలే వారికి తగిన గుణ పాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, కొమురయ్యయాదవ్, కాయితీ సమ్మయ్య, కనవేన శ్రీనివాస్, వెల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ, పిల్లి సత్తన్న, పుప్పాల తిరుపతిలతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.