కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో రైతుభరోసా విషయంలో సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట చెబుతూ రైతులను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేవంత్రెడ్డి రైతుభరోసాను ఓసారి సంక్రాంతికి వేస్తామని, మరోసారి జనవరి 26న వేస్తామని చెప్పారని గుర్తు చేశారు. మొన్న మార్చి 31 నాటికి రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పినా ఇప్పటి వరకు పడలేదన్నారు. రైతులకు నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడిని ఇప్పుడు పంటలు కోతకు వచ్చినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా.. కరోనా కష్టకాలం వచ్చినా.. రైతులకు సకాలంలోనే రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు.
కానీ, రేవంత్రెడ్డి మాత్రం రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు, అబద్ధాలతో అధికారం కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఓవైపు రైతులకు సాగునీరు సకాలంలో అందించక ఇప్పటికే పొలాలను ఎండబెట్టారని, సన్నవడ్లకు బోనస్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నా ఇంకా అనేక మంది రైతులకు అందించలేదన్నారు. కనీసం రైతుభరోసా అయినా సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, చొప్పదండి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.