గంగాధర, ఫిబ్రవరి 27 : పంటల సాగుకు సరిపడా యూరియా, సాగునీరు ఇవ్వకుండా రేవంత్ సర్కారు అన్నదాతను అరిగోస పెడుతున్నదని, ఇప్పుడు పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువుకు చిరునామా అని, బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో కనిపించని కరువు తిరిగి ఇప్పుడు కనిపిస్తున్నదని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మైసమ్మ చెరువును నింపాలని, అక్కడి నుంచి పంట పొలాలకు రెండ్రోజుల్లోగా నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
గంగాధర మండలం గోపాల్రావుపల్లిలో సాగునీరందక ఎండిపోతున్న పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూపెడుతూ కన్నీరు పెట్టుకున్న రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు ఇబ్బంది పడలేదని, సకాలంలో నీళ్లు, ఎరువులు, రైతు బంధు అందాయని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకొనే దిక్కులేదని మండిపడ్డారు. సాగునీరందక పంటలు ఎండుతున్నా సాగునీరివ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సకాలంలో కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే నారాయణపూర్ కుడి కాలువ పనులు 90శాతం పూర్తయ్యాయని, మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో మొండి చేయి చూపారని, మూడు దఫాలుగా ఎగ్గొట్టిన రైతుభరోసా విలువ 27వేల కోట్లు ఉంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ద పెద్ద డైలాగులతో కాలం వెల్లదీయడమే గానీ చొప్పదండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొండాపూర్, మైసమ్మ చెరువును నింపి, డీ4 కాలువ ద్వారా పంటలకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ బీఆర్ఎస్ గంగాధర మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, రాసూరి మల్లేశం, ఆకుల శంకరయ్య, నాగారపు సత్యనారాయణ, శ్రీమల్ల మేఘరాజు, వడ్లూరి ఆదిమల్లు, గడ్డం స్వామి, మామిడిపెల్లి అఖిల్ రైతులు ఉన్నారు.