పెద్దపల్లి, జూలై 4: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, సమ్మె హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో మేలు జరుగుతుందని ఆశపడితే సీఎం రేవంత్‌రెడ్డి నిండా ముంచారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొమ్ము పెంచుతామని నమ్మించి మోసం చేశారని, మెమో పేరుతో బలవంతంగా ఇంటికి పంపించడం అన్యాయమన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 6 నుంచి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సీఐటీయూ) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ గేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జీ జ్యోతి మాట్లాడుతూ, రాష్ట్రంలో 65ఏళ్లు పూర్తయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సుమారు 10వేల మంది దాకా ఉన్నారన్నారు.
జీవో నంబర్ 10 ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50వేలు ఉండేదని, ఆ మొత్తాన్ని పెంచాలని గతేడాది సెప్టెంబర్‌లో తాము నిరవధిక సమ్మె చేశామని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లకు 2లక్షలు, హెల్పర్లుకు లక్షకు పెంచుతామని, పెన్షన్, వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత జీవో 10 ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మె మో జారీ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశా రు.
దాదాపు 40 ఏండ్లుగా సేవలందించిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అవమానించేలా రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేయడం అన్యాయమని వాపోయారు. దానిని వెంటనే వెనకి తీసుకోవాలని, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్స్‌కు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఆర్ కమలేష్, సుభాషిని, సత్యమ్మ, లక్ష్మి, శాంత, నరసమ్మ, ఉదయశ్రీ, షరీఫా, రాజమ్మ విశాలాక్షి, సీపీఎం నాయకుడు సీపెల్లి రవీందర్ పాల్గొన్నారు.