రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరకు సీఎంను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. చేసేదేం లేక కొద్దిరోజుల క్రితం కోర్టు మెట్లెక్కితే.. పది వారాల్లో 24 శాతం వడ్డీతో కలిపి బెనిఫిట్స్‌ను చెల్లించాలని సర్కార్‌ను ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. నేడు ప్రజావాణిల్లో ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. అయినా స్పందన రాకపోతే తర్వాత నిరసన తెలిపేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
జగిత్యాల, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ప్రభుత్వం, రెండో దఫాలో తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో ఉద్యోగుల విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగింది. కేసీఆర్ పెంచిన విరమణ వయసు వల్ల నిలిచిపోయిన రిటైర్మెంట్లు గతేడాది మార్చి 31తో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 1800 నుంచి 2వేల మంది ఉద్యోగులు విరమణ పొందుతూ వస్తున్నారు. జగిత్యాల జిల్లాలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు విమరణ పొందారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పనిచేసిన కాలంలో జమ చేసుకున్న జీపీఎఫ్‌తో పాటు, గ్రాట్యుటీ, కముటెట్, సరెండర్ లీవ్స్ ఇలా అన్నింటినీ కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందిస్తుంది. సహజంగానే ఉద్యోగి రిటైర్మెంట్ గడువు సమీపిస్తున్న తరుణంలోని సదరు ఉద్యోగికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం సేకరించి, వాటి ఆధారంగా ఉద్యోగి విరమణ తదుపరి వారం పది రోజులు, గరిష్ఠంగా నెల వ్యవధిలో అన్ని ప్రయోజనాలను అందజేస్తూ వచ్చేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగులకు 15 నెలలు గడిచినా బెనిఫిట్స్‌ను ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెకేసుకొని పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం,తదితర అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారు, సొమ్ము చేతికి అందుతుందనే భరోసాతో అప్పులు చేసి కార్యాలను గట్టెకించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడాది దాటినా ఇంకా విరమణ సొమ్ము చేతికి అందకపోవడంతో సతమతమవుతున్నారు.
బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, ఎన్నిసార్లు విన్నపాలు, విజ్ఞప్తులు చేసినా కనికరించకపోవడంతో విసిగిపోయిన రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు హైకోర్టు తలుపు తట్టారు. జగిత్యాలకు చెందిన రిటైర్డ్ టీచర్లు ఆరేటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సత్యనారాయణ ఇలా చాలా మంది హైకోర్టులో వ్యక్తిగతంగా కేసులు వేశారు. రిటైర్డ్ ఉద్యోగుల కేసులను కలిపి విచారణ చేసిన హైకోర్టు, బెనిఫిట్స్ అనేవి ప్రతి రిటైర్డ్ ఉద్యోగి హక్కు అని, వాటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. పది వారాల వ్యవధిలో బెనిఫిట్స్‌ను 24 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టు తీర్పు ఇచ్చి పన్నెండు వారాలు గడిచిపోయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన రిటైర్డ్ టీచర్లు ఒక కార్యాచరణను రూపొందించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి విరమణ ఉపాధ్యాయులంతా హాజరై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తదుపరి నిరసనలు తెలియజేయడంతో పాటు ఇతర కార్యాచరణను తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా రిటైర్డ్ టీచర్లు మాత్రమే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని భావించినా, తదుపరి రిటైరయిన ప్రతి ఉద్యోగికి సమాచారాన్ని చేరవేశారు. పెద్ద సంఖ్యలో ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జగిత్యాలకు చెందిన వెంకటరమణ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. సర్వీస్‌లో ఉండగా అతడికి ఉపాధ్యాయుడిగా వచ్చే వేతనం తప్ప మరో ఆదాయ మార్గం లేదు. వచ్చిన వేతనంతోనే పిల్లలకు చదువులు, చెప్పించాడు. రిటైర్మెంట్ వరకు ఆయన పెద్దగా కూడబెట్టలేదు. విరమణ పొందిన తర్వాత ఇద్దరు పిల్లల పెండ్లిలు చేశాడు. పెండ్లిలకు పెద్ద మొత్తంలోనే అప్పులు చేయాల్సి వచ్చింది. రిటైర్ అయి పదిహేను నెలలు గడిచినా ఇంత వరకు వెంకట రమణ సార్‌కు 60 లక్షల వరకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడంతో వెంకటరమణ అనారోగ్యానికి గురయ్యాడు. ఒకవైపు అప్పుల వాళ్లకు నచ్చచెప్పలేక, బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియక సతమతం అవుతున్న వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించాడు. పదివారాల్లో బెనిఫిట్స్ ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పినా ఇంత వరకు డబ్బులు రాలేదు.
నేను గతేడాది జూన్‌లో రిటైర్ అయ్యాను. మోకాళ్ల నొప్పులతో సతమతం అవుతున్నా. గతేడాది డిసెంబర్లో మోకీలు మార్పిడి చేయించుకున్నా. అప్పు తెచ్చి చెల్లించా. ఇంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. నాలాగే వందల మంది రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం. పదిహేను నెలలు గడుస్తున్నా తమకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం సరికాదు. వయసు మళ్లిన వారికి ‘అనేక సమస్యలు ఉంటాయి. అనారోగ్యం, ఇతర బాధ్యతలు ఉంటాయి. అవి పూర్తి చేయాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం ప్రభుత్వం లేకపోవడం సరికాదు. జీపీఎఫ్, కముటెడ్, ఎర్న్డ్ లీవ్స్, ఆఫ్పే సెలవులు అన్ని మా సొంతానికి చెందినవి. వాటిని ఇవ్వకపోవడం అన్యాయం. హైకోర్టు చెప్పినా సర్కార్ వైఖరి మారకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. అందుకే క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నాం. అయినా ప్రభుత్వంలో స్పందన రాకపోతే మాకు చావులే శరణ్యం.
జగిత్యాల జిల్లాకు చెందిన అందె శ్రీనివాస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేసి 15 నెలల క్రితం రిటైర్డ్ అయ్యాడు. టీచర్‌గా, హెచ్ఎంగా పనిచేస్తున్న సమయంలో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పిల్లల పెండ్లిల కోసం వచ్చిన వేతనాన్ని వెచ్చించాడు. రిటైర్ అయిన తర్వాత ఇంటి నిర్మాణం చేపట్టాడు. 60 లక్షలకుపైగా బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నాడు. వాటితో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భావించాడు. కానీ ఏడాదిన్నర కావస్తున్నా బెనిఫిట్స్ రాకపోవడంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం చేద్దామన్నా ‘రిటైర్ అయ్యారు సార్. చెల్లింపులు ఇబ్బందవుతాయి. అప్పు ఇవ్వలేమని తెలిసిన వారు చెబుతుండడంతో శ్రీనివాస్ పూర్తిగా నీరుగారిపోయాడు. ఇంటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి, బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లెక్కాడు.