Karimnagar | కార్పొరేషన్, డిసెంబర్ 22 : కరీంనగర్‌లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ రిజిస్ట్రేషన్లను నిలిపివేయటం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక కార్యక్రమాలను వాయిదా వేసుకొవటంతో పాటుగా అవస్థలు పడాల్సి వస్తుందని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
రేకుర్తి చేందిన వందల సంఖ్యలోని ప్రజలు ముందుగా రేకుర్తిలోని ప్రధాన రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహాం వద్ద రోడ్డుపై బైటాయించారు. తమకు న్యాయం చేయాలని, పట్టా భూములు ఉన్న తమకు అమ్ముకొకుండా రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ తరలి వచ్చి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున్న ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ మాట్లాడుతూ తమ రేకుర్తి ప్రాంతంలో 1 నుంచి 230 వరకు సర్వే నంబర్లు ఉన్నాయన్నారు. అయితే వీటిల్లో కొన్ని మాత్రమే ప్రభుత్వ భూమిగా ఉందని మిగిలినవి అన్ని కూడ పట్టా భూములేనని తెలిపారు. అయితే జిల్లా యంత్రాగం ఈ భూములన్నింటిని కూడ 22 ఎ కింద చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేశారని పేర్కొన్నారు. గత ఆరు నెలలు రిజిస్ట్రేషన్లు నిలిపివేయటం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ భూముల్లో ఇప్పటికే 90 శాతం మేరకు ఇళ్ల నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటున్నారని తెలిపారు. ఈభూముల్లో సుమారుగా 3 వేయ్యిలకు పైగా ఇళ్లు నిర్మాణం జరిగిందన్నారు.
రిజిస్ట్రేషన్లు నిలిపివేయటం వల్ల ఆస్తులు ఉండి కూడ ఏమి చేయలేని దుస్థితి నెలకుందన్నారు. చివరకు తమకు భూములు ఉండి కూడ లేని పరిస్థితి నెలకుందన్నారు. ఈ ఇళ్లకు సంబంధించి గతంలో గ్రామ పంచాయితీ నుంచి ఇటీవల నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తీసుకొని ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. వీటితో పాటుగా ఈ ఇళ్లకు సంబంధించి పూర్తిస్థాయి ఇంటి పన్నులు చెల్లింపులతో పాటుగా, ఇతర అన్ని రకాల చెల్లింపు కూడా చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటుగా పలు ఇళ్ల గృహ రుణాలు కూడ తీసుకొని వాయిదాలు చెల్లిస్తున్నారని తెలిపారు. పూర్తిగా పట్టా భూముల సర్వే నంబర్లను కూడ 22 ఎ కింద చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేయటం అన్యాయమన్నారు.
ఈ భూములన్ని కూడ తహసీల్దార్, ఆర్డీవో రికార్డుల్లో ఆయా యజమాన్యుల పేర్లపై జమాబంధి కూడా ఉన్నాయన్నారు. కానీ అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లను నిలిపివేయటం వల్ల అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అనేక మంది పేద ఇంటి యజమాన్యులు తమ ఆర్థిక అవసరాల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం ఆయా భూములను, ఇళ్లను అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ భూములను అమ్ముకోలేకపోవటం వల్ల అనేక పెళ్లీలు ఇప్పటికే ఆగిపోయాయన్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాగం పట్టా భూములపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆస్తులను అమ్ముకునే అవకాశం లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 22 ఎ కింద చేర్చిన పట్టా సర్వే నంబర్లను వెంటనే దానిని నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయంలో జిల్లా యంత్రాగం తక్షణం చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేయటం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకొవాలని కోరారు.
ధర్నా అనంతరం జిల్లా అధికారులకు రేకుర్తి ప్రజలు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి ప్రాంత ప్రజలు పాశం మోహన్‌రెడ్డి, జాడి బాల్‌రెడ్డి, ఎంఎ రహీం, అందే శ్యాంసుందర్, ఆకుల కృష్ణ, శ్రీను, రవీందర్, నరేందర్, తిరుపతి, కార్తీక్, రాజగోపాల్, అంజయ్య, శ్రీనివాస్, రవీంద్రచారి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.