Stop Registration | కోరుట్ల, జనవరి 2: కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట గురుజులు, వాటి చుట్టూ ఉన్న కందకాలు, ఖాళీ స్థలాలను వ్యక్తిగత పేర్లపై రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుట్ల కోట గురుజుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ అశోక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల కోట బురుజులు సుమారు 11 వందల ఏళ్ల చరిత్ర కలిగి, చాణక్యులు, జైనులు పాలించిన కాలానికి చెందినవని చరిత్ర చెబుతుందని వారు పేర్కొన్నారు. గడీ బురుజుల చుట్టూ ఒకప్పుడు నీటితో నిండిన కందకాలు, నాలుగు ద్వారాలతో కూడిన రక్షణ కోట ఉండేదని పూర్వీకులు చెప్పేవారని తెలిపారు.
సుమారు 30 సంవత్సరాల క్రితం కోట చుట్టూ ఉన్న కందకాలను కొందరు పూడ్చి చదును చేశారని వినతి చేశారు. పురావస్తు శాఖ డాక్యుమెంట్ల ప్రకారం, గడీ బురుజుల చుట్టూ ఉన్న 3 ఎకరాలు 21 గుంటల ఖాళీ స్థలం గ్రామకంఠం, ఆబాది భూమిగా నమోదు అయి ఉందని, భూమికి ఎలాంటి వ్యక్తిగత యజమానులు లేరని పేర్కొన్నారు. ఈ ఖాళీ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ స్థలాన్ని ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కమిటీ ప్రతినిదులు కోరారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ చెన్న విశ్వనాథం, కో- కన్వీనర్ మహమ్మద్ ముజాహిద్, చింతా భూమేశ్వర్, పేట భాస్కర్ పాల్గొన్నారు.