ఏడాదిన్నర కిందటి వరకు సజీవధారలా కనిపించిన ఇరుకుల్ల వాగు ఇప్పుడు వట్టిపోయింది. చుక్కనీటి ప్రవాహం లేక ఎడారిలా మారింది. ఈ వాగు పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి, బోర్లు, బావులు అడుగంటాయి. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తగా, సమీప గ్రామాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల్లో ఎండిపోగా, ఉన్న పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేక రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. బావుల అడుగులు తవ్వించడమే కాదు, కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. అయినా పంటలను రక్షించుకునే మార్గం కనిపించడం లేదని దిగులు పడుతున్నారు. వాగులోకి తక్షణమే నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని వేడుకుంటున్నారు.
కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ రూరల్ : రామడుగు మండలం మోతె నుంచి వచ్చే వాగును ఆ మండలంలో మోతె వాగు అని, కరీంనగర్ మండలంలో ఇరుకుల్ల వాగు అని స్థానికులు పిలుచుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వంలో నారాయణపూర్ రిజర్వాయర్‌తో అనుసంధానించిన ఈ వాగులో నిత్యం నీటి ధారలు కనిపించేవి. భూగర్భజలాలు వృద్ధి చెంది ఈ వాగు పరిసర గ్రామాల రైతులకు సమృద్ధిగా సాగు నీరుండేది. వాగులో తవ్వుకున్న బావులు, బోర్లలో ఏడాది పొడుగునా నీళ్లుండేవి. 24 గంటలు కరెంట్ మోటర్లు నడిచినా బావుల్లో నీళ్లు ఒడిచేవి కాదు.
దీంతో ఈ వాగు పరిసరాల్లోని గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్, రామడుగు మండలంలోని షానగర్, రామడుగు, కొరటపల్లి, మోతె, గోలిరామయ్యపల్లి, రుద్రారం (కొంత భాగం), కొక్కెరకుంట, వన్నారం, దీని శివారు గ్రామం సుద్దాలపల్లి, కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్, ఇరుకుల్ల, వల్లంపహాడ్, గోపాల్పూర్, దుర్షేడు, నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్, మందులపల్లి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, గొల్లపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో పంటలు పుష్కలంగా పండేవి. సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటలు పండించుకునేది. నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు వదిలితే ఈ వాగులోకి వచ్చేవి. అక్కడి నుంచి సుల్తానాబాద్ మండలంలోని మూడు గ్రామాల మీదుగా మానేరు వాగులో కలిసేవి. ఇపుడు నారాయణపూర్ నుంచి నీళ్లు వదలకపోవడంతో ఈ వాగుల పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది.
పరిసరాల్లో ఎండుతున్న పంటలు
వానకాలంలో ఇరుకుల్ల వాగు ఉధృతంగా ప్రవహించేది. నగునూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ గ్రామాల్లో ఉన్న చెక్‌డ్యాంలలో నీళ్లు ఉండేవి. బావులు, బోర్లలో పుష్కలంగా భూగర్భ జలాలు ఉండేవి. ఈ పరిస్థితిని చూసిన పరిసర ప్రాంత రైతులు నారాయణపూర్ నుంచి కూడా నీళ్లు వదులుతారనే నమ్మకంతో వరి సాగు చేశారు. కానీ, రెండు నెలల్లో పరిస్థితి తారుమారైంది. చెక్ డ్యాంలలో నీళ్లు లేకుండా పోయాయి. అప్పడే ఎండలు ప్రతాపం చూపుతుండడంతో వాగులో తవ్వుకున్న బావులు కూడా క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్ గ్రామాల మధ్య ఉన్న 72 బావుల్లో 50కిపైగా ఎండిపోయాయి. కీలక సమయంలో సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. వాగు పరిసర గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. వాగు పరిసరాల్లోని బావులను తవ్విస్తున్నారు.
మరింత లోతుకు కొత్త బోర్లు వేయిస్తున్నారు. అయినా ఆశించిన నీళ్లు రాక తండ్లాడుతున్నారు. ఇతర పనులన్నీ మానుకొని పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అరగంటకోసారి కరెంట్ మోటర్లు పెట్టుకుంటూ పొలాలు తడిపేందుకు బావులు, బోర్ల వద్దనే పడిగాపులు పడుతున్నారు. మడిమడికి పైపులు వేసుకొని పారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పొలాలు తడారి పోతున్నాయి. నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్ గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయాయి. కింది మడి పారితే మీది మడి ఎండుతున్నదని, మీది మడికి నీళ్లు పెడితే కింది మడి తడారుతున్నదని రైతులు వాపోతున్నారు.
నీళ్లివ్వాలని విజ్ఞప్తులు
మోతె, ఇరుకుల్ల వాగులకు నారాయణపూర్ నుంచి నీళ్లివ్వాలని రామడుగు, కరీంనగర్, సుల్తానాబాద్ మండలాల రైతులు ఇప్పటికే అధికారులు, అధికార పార్టీ నాయకులకు అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. మొగ్దుంపూర్, నల్లగుంటపల్లి, మందులపల్లి, తదితర గ్రామాల రైతులు ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ పమేలా సత్పతికి మొరపెట్టుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోనూ తమ గోడు వెల్లబోసుకున్నారు. పక్షం రోజులు గడిచినా ఇప్పటి వరకు వాగులోకి నీళ్లు వదల లేదని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. మొగ్దుంపూర్లోని ఏటిగడ్డ పొలాలు ఎండిపోయాయని, నల్లగుంటపల్లి, గొల్లపల్లి, నారాయణపూర్, తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే వాగులోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు పెరిగి తమ పంటలు రక్షించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం పదిరోజుల్లో దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
నాలుగెకరాలు ఎండిపోయింది
కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లికి చెందిన ఈ రైతు పేరు తమ్మనవేణి ఓదెలు. ఆయనకు ఇరుకుల్ల వాగు పరిసరాల్లో ఐదెకరాల పొలం ఉన్నది. పదేళ్లలో ఐదెకరాలు నాటేస్తే ఏనాడూ ఒక్క గుంట ఎండకుండా పంట చేతికి వచ్చింది. కరెంట్ కాడికి పోవాలి, పొలం పారియ్యాలనే ఆలోచనే ఉండేది కాదు. వాగులో తవ్వుకున్న బావిలో పుష్కలంగా నీళ్లుండేవి. ఆటోమెటిక్ స్టార్టర్ ఉండడం వల్ల కరెంట్ ఉంటే చాలు పొలానికి నీళ్లు వచ్చేవి. కానీ, ఈ ఏడాదిన్నరలో రెండు యాసంగి పంటలు దెబ్బతీశాయని ఓదెలు వాపోతున్నాడు. వాగులో తవ్విన బావి అడుగంటింది. ఐదెకరాల వరి నాటేస్తే నాలుగెకరాలు ఎండిపోయింది. మిగిలిన ఎకరం పొలం కాపాడుకునేందుకు ఇప్పుడు నానా యాతన పడుతున్నాడు. అది కూడా 300 మీటర్ల వరకు పైపులు వేసి మడి మడికి నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి తానెప్పుడూ చూడ లేదని ఓదెలు చెబుతున్నాడు. కేసీఆర్ ఉన్నపుడు నారాయణపూర్ నుంచి నీళ్లు వదిలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకనే తమకు ఈ దుర్గతి ఏర్పడిందని మండిపడుతున్నాడు.
నీళ్లు కొనుక్కుంటున్న గంగయ్య
ఇక్కడ పైపులపై కూర్చున్న రైతు గంగాధర గంగయ్యది మొగ్దుంపూర్. ఇరుకుల్ల వాగు ఒడ్డున ఆయనకు రెండెకరాల పొలం ఉన్నది. పంట పొట్టదశకు వచ్చిన తర్వాత ఇతని బోరు ఎత్తిపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో పడిన గంగయ్య పక్క రైతుల బావి నుంచి నీళ్లు అడిగాడు. నీటి ఎద్దడి ఉన్న ఈ సమయంలో ఏ రైతు ఉచితంగా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. రెండెకరాలకు నెల రోజుల వరకు నీళ్లిస్తే 10 వేలు ఇవ్వాలని ఆ బావి రైతులు అడిగారు. 6 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న గంగయ్య ఆ బావి నుంచి తన పొలం వద్దకు నీళ్లు తెచ్చుకునేందుకు మరో 16 వేలు ఖర్చు చేసి 225 మీటర్ల పైపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే రెండెకరాలపై 50 వేల వరకు పెట్టుబడి పెట్టిన ఆయనకు ఇప్పుడు పైపులు అదనపు ఖర్చవుతున్నది. అంతే కాకుండా, పైపులు సాపేందుకు కూడా కూలీలు వస్తున్నారని, వారికో 2 వేల వరకు ఖర్చవుతుందని వాపోతున్నాడు.
నీళ్లిత్తెనే మా పంటలు చేతికత్తయి
నా బోరు వాగు ఒడ్డుకే ఉన్నది. పదేండ్ల సంది ఒక్కనాడన్నా నీళ్లు ఒడవలె. ఇప్పుడే ఎద్దెమద్దెం ఐతంది. పొద్దుగాల లేసినంక వచ్చిన అరగంటకోసారి బోరు పెడుతున్న.. ఎనిమిది నిమిషాలు పోత్తంది. 10 నిమిషాలు దాటుత లేదు. నీళ్లొడిసిన సప్పుడైతంది. కింది మడి ఎన్కకు పట్టింది. నీళ్లు పెట్టినా నెర్రెలు నిండెతానికే సరిపోతన్నయి. పోయినేడు ఇట్ల లేకుండె. వానకాలం పంటలు మంచిగనే పండినయి. యాసంగిల వాగుల కొంత ధార ఉండె. ఇప్పుడు సుతం నాట్లేసెటప్పుడు సన్నటి ధార ఉండె. నారాయణపూర్ నుంచి ఎట్లయినా నీళ్లిత్తరని నమ్మకం మీద నాట్లేసినం. ఒక్క నెలగడిసిందో లేదో వాగు బొత్తిలకు ఎండి పోయింది. నీళ్లిత్తెనే మా పంటలు చేతికత్తయి.
– దాడి చంద్రయ్య, మొగ్దుంపూర్
మూడు గంటలు సుత కరెంటు వాడ్తలేం
ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తున్నమని చెప్పడం బాగనే ఉన్నది. బాయిలు ఎండిపాయె.. బోర్లు ఎండిపాయె. కరెంట్ ఇచ్చి లాభమేంది? మూడు గంటలు సుతం సరిగ్గా వాడుకుంటలేం. అంటే మా పరిస్థితి ఎట్లున్నదో చూడున్రి. పదేండ్ల వట్టి వ్యవసాయం పనులు చూసుకుంట హమాలీ పనికి వెళ్లెటోన్ని. ఇప్పుడు రోజు బాయికాన్నే ఉండుడైతంది. అది పారనీ పారకపోనియని అరగంటకో మడికి తడిపెడుతున్న. ఎండ విపరీతంగా కొడ్తంది. తడిసిన మడికి మళ్ల నీళ్లు పెట్టె వరకే ఇంకో మడి ఎండి పోతున్నది. బాయిల నీళ్లు లేవు. రైతుల పరిస్థితి దారుణమైంది. ఒక్క బాయిమీద సుత ఆశ లేదు. వాగుల బాయిలన్నీ ఎండిపోయినయ్. వేలకు వేలు పెట్టుబడులు పెడ్తిమి. అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది..
– తమ్మనవేణి సంజీవ్, నల్లగుంటపల్లి
వాగులకు నీళ్లు వదలాలె
మా బాయి 12 గజాలు ఉండె. 10 ఎకరాల వరి పారిచ్చేది. ఎన్నడూ నీళ్లొడవ లేదు. ఇప్పుడు వాగు ఎండిపోయింది. బాయి ఎండిపోయింది. రెండు లక్షలు పెట్టి మూడు గజాల బాయి తవ్విస్తున్నం. అట్ల సుత నీళ్లస్తయన్న నమ్మకం కనిపిస్తలేదు. ఆరేడు గంటలు కరెంటు నడిచినా నీళ్లు దంగకపోయేది. ఇప్పుడు అరగంట సుతం నడుస్తలేదు. పంట ఎండిపోతదని బాయి తవ్విస్తున్నం. ఇరుకుల్ల వాగులకు నీళ్లిడువాల్నని కలెక్టర్‌ను కలిసినం. అయినా నీళ్లిస్త లేరు. మా దిక్కు చూసెటోళ్లే లేరు. కేసీఆర్ ఉన్నపుడు నీళ్లకు ఇబ్బంది రాలే. నీళ్లు లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తయో ఇప్పుడు తెలుస్తుంది. మా వాగులకు ఇప్పటికైనా నీళ్లు వదలాలె. లేకుంటే పంటలు చేతికి రావు.
– పొలగాని సంపత్, మొగ్దుంపూర్