Dharmaram | ధర్మారం, జూన్19 : తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ వృత్తిని సంరక్షించాలని ధర్మారం స్వర్ణకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ దురిశెట్టి శ్రీనివాస్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా తమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాలేదని వారు పేర్కొన్నారు. కార్పొరేషన్ లేని కారణంగా స్వర్ణకారుల పరిస్థితి నానాటికి దిగజారి పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు జ్యువెలరీ వ్యాపారం లోకి దిగి పెద్ద ఎత్తున పెట్టుబడులతో నగల దుకాణాలు ఏర్పాటు చేసి మోసపూరిత ప్రకటనలు చేస్తూ తమ స్వర్ణకార వృత్తిని దెబ్బతీస్తున్నారని వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో తమ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జీవో 272 సవరణ చేసి దానిని పటిష్టంగా అమలుపరిచి స్వర్ణకారులను దొంగ బంగారం రికవరీ నుంచి కాపాడాలని, అలాగే గీత, నేత వృత్తిదారుల మాదిరిగానే స్వర్ణకారులకు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి రూ.5వేలు మంజూరు చేయాలని స్వర్ణకారుల సంక్షేమ సంఘం తహసీల్దార్ కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మూటపల్లి సత్యనారాయణ, అధ్యక్షుడు మూటపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీధర్, కోశాధికారి కట్ట శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు సింహరాజు తిరుపతి, ఉపాధ్యక్షులు పాంచాల శ్రీనివాస్, సింహరాజు మహేందర్, సహాయ కార్యదర్శులు కట్ట శ్రీనివాస్, కంచి శివకుమార్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.