Peddapally | పెద్దపల్లి : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసులు, డాక్టర్ల మధ్య క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా విజేతగా నిలిచిన పోలీసు టీంకు ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు, రన్నరఫ్గా నిలిచిన వెటర్నరీ వైద్యులకు రూ.25 వేలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
విధి నిర్వహణలో ఒత్తిడికి లోనైనప్పుడు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, ప్రవీణ్ కుమార్, బర్ల అనిల్ కుమార్, సుబ్బారెడ్డి, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రణీత్, ఎస్సైలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.