నిరుడితో పోలిస్తే ఈ సారి వానకాలంలో సాగు విస్తీర్ణం తగ్గింది. కరీంనగర్ జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా తేడా వచ్చింది. గత 2023 వానకాలం సీజన్ మొదట్లోనే వర్షాలు అనుకూలించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు కొనసాగించడంతో వ్యవసాయం దండిగా సాగి, రైతన్న పంట పండింది.
కానీ, ఈ సీజన్ మొదట్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, కాళేశ్వరం జలాల తరలింపు నిలిపివేయడం, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో గతేడాదికి ఇప్పటికి సాగు తగ్గింది. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా వరికే అగ్రస్థానం దక్కగా, రైతాంగం రికార్డు స్థాయిలో 1.18లక్షల ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేసి బోనస్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ముగిసి యాసంగి మొదలైంది. అయితే వానకాలం సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే 2023 సీజన్ కంటే ఈ సారి కొంత తగ్గింది. దీనికి ప్రధాన కారణం సీజన్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం వినియోగించకపోవడమేనని స్పష్టంగా తెలుస్తున్నది. ప్రతి సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ అధికారులు సాగు అంచనాలు రూపొందిస్తారు. దానికంటే ముందు సీజన్లో సాగైన పంటలను దృష్టిలోకి తీసుకుని తయారుచేస్తారు.
ఈ సారి కూడా అన్ని రకాల పంటలు కలిపి 3,45,070 ఎకరాల్లో ఈ వానకాలంలో పంటలు సాగయ్యే అవకాశముంటుందని అంచనా వేశారు. ఏ సీజన్ చూసినా అంచనాకు కాస్త అటీటుగా పంటలు సాగవుతాయి. కానీ, ఈ సారి 10,464 ఎకరాల తేడా వచ్చింది. గత వానకాలం సీజన్లో 3,42,919 ఎకరాల్లో పంటలు సాగయితే, ఈ సీజన్లో మాత్రం 3,34,606 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే 8,313 ఎకరాల్లో పంటలు తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడం వంటి కారణాలతో రైతులు సాగుకు ముందుకు రాకపోవడంతో ఒక్క ఏడాదిలో 8 వేల ఎకరాలకుపైగా సాగు తగ్గింది.
జూలై, ఆగస్టు మూడో వారం వరకు వర్షాలు దోబూచులాడాయి. ఎగువన వర్షాలు పడి గోదావరి నుంచి వరద ప్రవాహం ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు దాదాపు అడుగంటి కనిపించాయి. పంటల సాగు చివరి దశకు వస్తున్న తరుణంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంలో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చాయి. అయితే అదును దాటడంతో రైతులు పంటలు సాగు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా పంటల సాగు తగ్గింది. ముఖ్యంగా అపరాల సాగుకు రైతులు మొగ్గు చూపలేదు. వరి, పత్తి పంటలు మాత్రం అధికంగానే సాగు చేశారు.
ఎప్పటిలాగే ఈ సారి కూడా వరిదే అగ్రస్థానంగా నిలిచింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం పంటల విస్తీర్ణం 3,34,606 ఎకరాలు కాగా, 2,75,448 ఎకరాల్లో వరి సాగయింది. 48 వేల ఎకరాల్లో సాగవుతుందనుకున్న పత్తి 43,878 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కంది 2 వేల ఎకరాల అంచనాలకు కేవలం 811 ఎకరాల్లోనే సాగయింది. 4,500 ఎకరాల్లో మక్కకు అంచనాలు వేయగా, ఇదొక్కటే అందుకు తగినట్టుగా 4,498 ఎకరాల్లో సాగయింది.
ఇక మిర్చి, పెసర, మినుములు, ఉలువలు, పసుపు, పొగాకు ఇతర పంటలు 10,782 ఎకరాల్లో సాగయ్యాయి. కాగా, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో సన్నరకం వడ్లను పండించారు. గతంలో 20 నుంచి 30 వేల ఎకరాలు కూడా దాటకపోగా, ఈ సీజన్లో 1,18,500 ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుందనే నమ్మకంతో రైతులు ఇటు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ ప్రకటించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 వానకాలంలో రైతుబంధు కింద కరీంనగర్ జిల్లాలోని 2.07 లక్షల మంది రైతులకు 182.03 కోట్లు పెట్టుబడి సాయం ఇచ్చింది. పోయి న యాసంగిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును రైతు భరోసాగా మా ర్చింది. కానీ ఈ వానకాలంలో మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా చేతులెత్తేసింది. కానీ, ఎన్నికల ముందు ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామని ప్రకటించినట్టు ఇవ్వలేదు. ఈ వానకాలం అయితే పూర్తిగా చేతులెత్తేసింది.
దీంతో రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి వ చ్చింది. పోయిన యాసంగిలో చూ స్తే 2,03,096 మందికి 182.01 కోట్లు మంజూరయ్యాయి. అందు లో 1,90,826 మందికి 177. 61 కోట్లు అందాయి. మిగతా రైతులకు ఇప్పటికీ అందలేదు. పైగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నంలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం యాసంగి సీజన్లోనైనా రైతు భరోసాకు శ్రీకారం చుట్టే నమ్మకం కనిపించడం లేదని వాపోతున్నారు.