Vemulawada | వేములవాడ, జనవరి 27 : పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా ముఖ్యఅతిథిగా ఎన్నికల ఇన్చార్జి పెద్దిరెడ్డి హాజరయ్యారు. బీజేపీలో గత 40 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ విజయ సంకల్ప సమావేశానికి డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్ అంతర్గత విభేదాలు ఉండగా మరోసారి పార్టీ విజయసంకల్ప సమావేశంలో బహిర్గతమైంది.
పురపాలక సంఘం పరిధిలోని 28 వార్డులను దక్కించుకొని చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలని ఇన్చార్జి చెపుతుండగా నాయకుల మధ్య విభేదాలు కుదరని సయోధ్యతో కార్యకర్తలు గందరగోళానికి కూడా అవుతున్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, నాయకులు ఎర్రం మహేష్, కుమ్మరి శంకర్, అల్లాడి రమేష్, లింగంపల్లి శంకర్ తదితరులు ఉన్నారు.