Odela | ఓదెల, మే 16:: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ కురువృద్ధుడు కళ్ళకు అద్దాలు లేకుండా భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు . ఓదెలకు చెందిన బీరం లింగయ్య 90 సంవత్సరాలు పైబడి ఉంటాడు. అతడు ప్రతీరోజు ఉదయం ఇంటిముందు చిన్న పీట మీద కూర్చుని భగవద్గీతలోని పేజీలను, భక్తి గ్రంథాలకు చెందిన పుస్తకాలను చదువుతూ ఉంటాడు. అతడి భార్య రాధమ్మతో పాటు అతడికి కూడా ఒక కన్ను మాత్రమే ఉంది.
తన చిన్న వయసులోనే ఒక కన్ను పోచమ్మ వచ్చి పోయిందని తెలిపాడు. ఒంటి కన్నుతోనే ఇద్దరు వృద్ధులు జీవిస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో చిన్నపాటి ఇంటిలో జీవిస్తున్నారు. 90 సంవత్సరాల వయసులో ప్రతీరోజు ఉదయాన్నే భక్తి పుస్తకాలను చదువుతూ కాలక్షేపాన్ని చేస్తూ ఉంటున్నాడు. వీరి ఇల్లు ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉండడం, ప్రతిరోజు ఉదయం భక్తి పుస్తకాలను చదువుతూ ఉంటుండడంతో చూపరులను ఆకట్టుకుంటుంది. అందులోనూ కంటికి అద్దాలు లేకుండా ఒక కన్నుతో గలగల చదువుతూ ఉంటాడు. ప్రస్తుత తరుణంలో హైస్కూల్ స్థాయిలోని పిల్లలకు సోడాబుడ్డి అద్దాలు పెట్టుకోవడం చూస్తున్నాం.
కానీ 9 పదుల వయసులో కంటికి అద్దాలు లేకుండా చదువుతుండడం గ్రేట్. 90 సంవత్సరాల క్రితం ఓదెల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు తెలిపాడు. తమ చిన్ననాటి వయసులో ఎలాంటి మందులు లేని కూడు తినడం, కాయ కష్టం చేయడం వలన ఇలా కనులు మంచిగా కనబడుతున్నట్టు వృద్ధుడు పేర్కొన్నారు. ఈ వయసులో కూడా ఇప్పటివరకు తన కళ్ళను ఏ వైద్యుని దగ్గర చూయించుకోలేదని వృద్ధుడు లింగయ్య గర్వంగా చెప్తున్నాడు.