బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది పిల్లలు మాత్రమే సరైన మోతాదులో రక్తం కలిగి ఉండగా, 71 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండడం కలవరపెడుతున్నది. అందులో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులే అధికంగా ఉన్నట్టు తెలుస్తుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఎనీమియాతో బాధపడే పిల్లలు శారీరక, మానసిక రుగ్మతల బారిన పడడమే కాకుండా, చదువు, క్రీడలపై సరైన దృష్టి సారించలేని పరిస్థితి ఉంటుంది. అయితే పౌష్టికాహార లోపమే అందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత బాల్యంలో ప్రారంభమై క్రమంగా పెరుగుతుందని, పెద్దవాళ్లు అయిన తర్వాత సైతం అనేక శారరీక సమస్యలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్త హీనత వస్తుంది. దానినే వైద్య పరిభాషలో ఎనీమియాగా చెబుతారు. రక్తహీనత ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరానికి ప్రాణవాయువు (ఆక్సీజన్) సరఫరా సరిగ్గా కాక, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. దీంతో అనేక శారీరక, మానసిక రుగ్మతల బారిన పడుతారు. రక్తహీనతతో బాధపడే పిల్లల్లో శారీరక నీరసం, అలసట ఉంటుంది. దీనివల్ల చురుకుదనం తగ్గిపోతుంది. ఆటలు, ఇతర సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతారు. దృష్టిలోపం బారిన పడి చదువుల్లో వెనుకబడిపోతారు. ఈ వైకల్యాలు క్రమంగా పెరిగిపోయి, పిల్లలు యువతగా మారిన తదుపరి సైతం వారిని వెంటాడుతాయి.
పిల్లల్లో రక్తహీనత పెరిగిపోతున్నదని, ముఖ్యంగా వెనుకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐక్యరాజ్య సమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేయడంతోపాటు రక్తహీనత నివారణకు నిధులు మంజూరు చేశాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ రక్తహీనతపై అధ్యయనం చేసి, ఎనీమియా బాధిత చిన్నారులకు స్వస్థత కలిగించే చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో జిల్లాకు 12 బృందాలను నియమించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చిన్నారులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా 5, 6, 7వ తరగతి చదువుతున్న బాల బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేశారు. 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల కంటే ఎక్కువ రక్తం శాతం ఉంటే రక్తహీనత లేదని, 12 గ్రాముల కంటే తక్కువ 8 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మధ్యస్థ ఎనీమియా బాధితులుగా గుర్తించారు. రక్తంలో 8 గ్రాముల కంటే తక్కువ ఉన్న వారిని తీవ్రమైన ఎనీమియా బాధితులుగా నిర్ధారించారు.
రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మొత్తం 19,846 మంది చిన్నారులకు పరీక్షలు చేశారు. అందులో 10,478 మంది బాలికలు కాగా, 9368 మంది బాలురు ఉన్నారు. అయితే 5,883 మంది బాలబాలికలు మాత్రమే నిర్దేశిత రక్తశాతం కలిగి ఉన్నారు. అందులో 2908 మంది బాలికలు, 2975 మంది బాలురు ఉన్నారు. బాలికల్లో 27.75 శాతం మందికి నిర్దేశిత రక్తశాతం కలిగి ఉండగా, 73.25 శాతం మందికి ఎనీమియా ఉన్నట్టు నిర్ధారించారు. ఇక బాలురలో 31.75 శాతం మంది సరైన రక్తశాతాన్ని కలిగి ఉండగా, 69.25 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 4911 మంది బాలబాలికలకు 11 నుంచి 10 గ్రాముల మధ్య రక్తశాతం ఉండగా, అందులో 2538 మంది బాలికలు, 2373 మంది బాలురు ఉన్నారు. ఇక 9 నుంచి 8 గ్రాముల రక్తశాతం కలిగిన వారిలో 4558 మంది బాలికలు, 3758 మంది బాలురు మొత్తంగా 8317 మంది ఉన్నారు. ఇది అత్యంత బాధాకరమని వైద్యులు చెబుతున్నారు. 7 గ్రాముల కంటే తక్కువ రక్తశాతం కలిగిన వారిలో 474 మంది బాలికలు, 261 మంది బాలురు మొత్తం 735 మంది ఉన్నట్టు లెక్క తేల్చారు. మొత్తంగా పరిశీలిస్తే పెద్ద సంఖ్యలోనే మధ్యస్థ, తీవ్రస్థాయి ఎనీమియా బాధితులు ఉన్నారని స్పష్టమైంది. కేవలం 29 శాతం మంది బాల బాలికలు మాత్రమే కలిగి ఉండగా, 71 శాతం మంది పిల్లలు రక్తహీనత బాధితులే అని గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల్లోనే రక్తహీనత అధికంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. గ్రామీణ పిల్లల్లో 90 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులే కొంత మెరుగ్గా ఉన్నారని ప్రత్యేక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి పిల్లల్లో రక్తహీనతతను నివారించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నా పౌష్టికాహారం మాత్రం అందడం లేదని తెలుస్తున్నది. ప్రభుత్వం అతి తక్కువగా నిధులు ఇస్తుండడంతో మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆకు కూరలు, గుడ్లు, మాంసకృత్తులు, బెల్లం, నువ్వులు, పల్లీలు, తాజా కూరగాయలు పిల్లలకు అందిస్తేనే వారిలో రక్తం వృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, అందులో ఏ ఒక్కటీ మధ్యాహ్న భోజనంలో అందించడం లేదు. బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర 7 పలుకుతుండగా, పాఠశాలల్లో భోజనం అందించే గుడ్డుకు కేవలం 5 ఇస్తున్నారు. 2 నష్టంతో భోజన తయారీదారులు కోడిగుడ్లు కొని వడ్డించడం లేదు. ఇక ఆకు కూరలు, నూనె ధరలు పెరగడంతో వాటిని తగ్గించారు. బెల్లం, నువ్వులు, రాగిజావను గత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థతో కలిసి సంయుక్తంగా అమలు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో రాగిజావ, 10 గ్రాముల బెల్లం ప్యాకెట్ పంపిణీని ఆ సంస్థ నిలిపివేసింది. పోషకాహారం అందకుండా పోవడమే పిల్లల్లో రక్తహీనతకు కారణమని వైద్యులు చెబుతుండగా, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఎనీమియా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండడం బాధాకరం. రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలకు ఉన్న రక్తహీనత స్థాయిని బట్టి వారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. ప్రతి రెండు నెలలకు ఒక్కసారి పిల్లలకు రక్త పరీక్షలు చేస్తున్నాం. ఆ నివేదికల ఆధారంగా పిల్లలకు మందులు, తగిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ శ్రీనివాస్, ఆర్బీఎస్కే కో-ఆర్డినేటర్
రక్త హీనత (ఎనీమియా) అనేది చూడడానికి సాధారణంగా కనిపిస్తుంది. కానీ, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మనిషికి రక్తం ఉన్నప్పుడే ఏమైనా సాధించగలడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే, దురదృష్టవశాత్తు పిల్లలు అధిక శాతం ఎనీమియాతో బాధపడుతుండడం చూస్తున్నాం. 30 ఏండ్ల క్రితం 20 ఏండ్ల లోపు పిల్లల కంటికి అద్దాలు కనిపించేవి కాదు. వందలో ఒకరో ఇద్దరి ఉంటే ఎక్కువ. అలాంటి వారిని తరగతి గదిలో ఇతర పిల్లలు ఆటపట్టించేవారు. అలాగే, అద్దాలు పెట్టుకునే పిల్లలు ఎక్కువ పుస్తకాల పురుగులని, బాగా చదువుతారని అందుకే కంటి అద్దాలు వచ్చాయని అనుకునేది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. తరగతి గదిలో సగానికి పైగా మంది పిల్లలు కళ్లద్దాలు పెట్టుకునే కనిపిస్తున్నారు. అద్దాలు పెట్టుకునే పిల్లలు క్లెవర్ పిల్లలు అని అనుకునే పరిస్థితులు పోయాయి. పిల్లలే కాదు.. యువతుల్లోనూ రక్తహీనత కనిపిస్తుంది. ఎనీమియా పోవాలంటే మాత్రలు పంపిణీ చేయడం కాదు.. పోషకాహారం అందించేలా చూడాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని పంపిణీ చేయాలి. ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, చికెన్, తాజా కూరగాయలు, సీ విటమిన్ అధికంగా ఉండే ఆహారం, పల్లిపట్టీలు, నువ్వుల ముద్దలాంటివి సరఫరా చేయాలి. చిన్నప్పటి నుంచే సమతుల ఆహారం ఇవ్వాలి.
– డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు