Rebels | గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఏర్పడుతున్నాయి. 60 డివిజన్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుపై పోటీ పడుతుండగా మరి కొంతమంది ఇండిపెండెంట్‌గా పోటీపడుతున్నారు. ఓకే పార్టీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో వివిధ డివిజన్లలో పోటీ పడుతుండడంతో ఓట్లు చీలిపోయి ఇబ్బందులు ఏర్పడతాయని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులు ఎక్కువగా లేకపోవడం వల్ల ఓట్లు చీలకుండా సాలీడుగా పడతాయని అంచనా వ్యక్తమవుతోంది. బీజేపీలో పెద్దగా రెబల్స్ లేకపోవడం వారికి ఇబ్బంది లేకుండా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడడం అభ్యర్థులను నిర్ణయించిన క్రమంలో ఇతరులు బరిలోనే ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాత్రం రెబల్స్‌తో మాకు సంబంధం లేదంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనలో రెబల్స్ అభ్యర్థులుగా ఉన్నవారు ఎమ్మెల్యే పేరు వాడడం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను చెప్పడం జెండాలను పెట్టుకోవడం నిషేధించినట్లు పేర్కొన్నారు. వాస్తవంగా ఏదైనా పార్టీ నుంచి రెబల్స్ గా ఉన్న వారిని క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చేస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా రెబల్స్ ను ప్రోత్సహించే విధంగా ప్రకటన జారీ చేయడం ఆశ్ఛర్యానికి గురిచేస్తోంది.
కార్పొరేషన్ లోని రెండో డివిజన్లో రెబల్‌గా పోటీపడుతున్న ఈదునూరి రవి మూడో డివిజన్లో ఉప్పరపల్లి లక్ష్మణ్ ఐదో డివిజన్లో దాసరి శ్రీనివాస్ 24వ డివిజన్లో కొలీపాక సుజాత, 12వ డివిజన్లో వేణు భాస్కర్, లాయల్ శంకర్, 42 డివిజన్లో దొంతుల శాంత కుమారి, 32 డివిజన్లో కత్తెరమల్ల సుజాత రమేష్, 27 డివిజన్లో వాజాద్ ఖాన్, 11 డివిజన్లో రషీద్ యూసఫ్, కాల్ షకీల్, దాసరి విజయ్, 36 డివిజన్లో కలువల సంజీవ్, 44 డివిజన్లో డేవిడ్, రాజు, 33 డివిజన్లో ఈదునూరి నరేష్ రెబల్స్ గా రంగంలో ఉన్నారు. వీరిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా గెలుపు సాధిస్తే తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకునే విధంగా ప్రకటన చేసినట్లుగా అర్థమవుతోంది. ఏది ఏమైనా అధికార పార్టీకి రెబల్స్ బెడదతో ఇబ్బందులు తీవ్రమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.