శేరిలింగంపల్లి, జూలై 25: హాలిడే మెంబర్‌షిప్‌లు, టూర్ ప్యాకేజీల పేరుతో ప్రజలను మోసగిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝులిపించారు. ది పసిఫిక్ హాలిడే వరల్డ్ (4ఆర్ సీజన్స్ హాలిడేస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ యూనిట్)సంస్థకు చెందిన 15 మంది కన్సల్టెంట్లు, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.22 లక్షలను వారు మోసపూరితంగా వసూలు చేసినట్లు తేలింది. శనివారం గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ ఉదయ్‌రెడ్డి, ఏసీపీ రమణగౌడ్, ఇన్స్పెక్టర్ సైదులు వివరాలను వెల్లడించారు.
న్యూఢిల్లీకి చెందిన రాజేశ్‌కుమార్, మహమ్మద్ రిహాన్ అక్తర్, అబ్దుల్ రషీద్, రామ్షింగ్ ధామీలు 4ఆర్ సీజన్స్ హాలిడేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ టూర్స్ అండ్ ట్రావె ల్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ది పసిఫిక్ హాలిడే వరల్డ్ పేరుతో తమ కంపెనీకి చెందిన మార్కెటింగ్ సిబ్బందిని ఇటీవల హైదరాబాద్‌కు పంపించారు. 15 మంది సిబ్బంది నగరంలోని వేర్వేరు షాపింగ్‌మాల్స్, కమర్షియల్ సెంటర్లకు వెళ్లి అక్కడికి వచ్చే ప్రజలకు ఉచిత కూపన్లు, గిఫ్ట్ ఓచర్లు అందిస్తామని వారి ఫోన్ నంబర్లు సేకరించేవారు.
అనంతరం వారికి ఫోన్లు చేసి నగరంలోని స్టార్ హోటళ్లకు ఆహ్వానించి హాలిడే మెంబర్షిప్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు చూపి భారీ మొత్తాలు చెల్లించేలా ప్రలోభ పెట్టేవారు. రూ.1.25 లక్షలు చెల్లిస్తే 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాది దేశంలో ఎక్కడైనా 7 రాత్రుల ఉచిత బస, 10 సంవత్సరాల మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లోనూ 7 రాత్రుల బస కల్పిస్తామని హామీలు ఇచ్చి సభ్యత్వాలు విక్రయించారు. ఈనెల 24న బాధితుడు వుట్టూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 16న గచ్చిబౌలిలోని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మి హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ.3.40 లక్షలు చెల్లించినట్లు స్వరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డబ్బు తీసుకున్న తరువాత వాగ్దానం చేసిన సేవలను అందించకపోవడంతోపాటు ఫోన్ కాల్స్, సందేశాలకు కూడా స్పందించ డం మానేశారని బాధితుడు తెలిపాడు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు 4ఆర్ సీజన్స్ హాలిడేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ది పసిఫిక్ హాలిడే వరల్డ్ సంస్థలో హాలిడే కన్సల్టెంట్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తూ గచ్చిబౌలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పసిఫిక్ హాలిడే వరల్డ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, హాలిడే కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న మొత్తం 15 మంది మార్కెటింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
వీరంతా కలిసి 19 మందిని మోసం చేసి వారి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే కంపెనీ ప్రతినిధులు గతంలో విజయవాడలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు కంపెనీ ప్రధాన నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ ఉదయ్‌రెడ్డి తెలిపారు.