గంగాధర, జూలై 28 : గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని కొత్తపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేసిన తొమ్మిది అక్రమ రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు కారణమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారులను మభ్యపెట్టి చేయించిన ఈ రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ మెడకు చుట్టుకున్నాయి.
అధికారుల సమగ్ర విచారణతో తీగ లాగితే డొంక కదిలిన చందంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన గంగాధర సబ్ రిజిస్ట్రార్ అబ్జల్ నూర్ఖాన్ను ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. తన తప్పు తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ కొనుగోలు, అమ్మకందారులను పిలిచి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించినా అప్పటికే ఆలస్యమైంది. కొత్తపల్లి మండల కేంద్రంతో పాటు రేకుర్తి గ్రామంలోని పలు సర్వే నంబర్లలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై లోక్ సత్తా సభ్యులు ఫిర్యాదులు చేయడంతో ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ క్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఆర్డీవో, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విచారణ జరిపారు. మేలో కొత్తపల్లి పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ గంగాధర, తిమ్మాపూర్, కరీంనగర్, హుజురాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విచారణకు ఆదేశించారు.
అందులో భాగంగా గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని సర్వే నంబర్ 272/14 లోని 20 గుంటల భూమిలో నిబంధనలకు విరుద్ధంగా 2024 డిసెంబర్ 28న తొమ్మిది అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారులు గుర్తించి నివేదిక ఇచ్చారు. ఆ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ అబ్జల్నూర్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. అలాగే, కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సదాశివ రామకృష్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు.