కార్పొరేషన్, అక్టోబర్ 13: వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చాయి కదా అని విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకుడు బండి సంజయ్ అసలు ఆపార్టీకి ఎందుకు ఓటు వేయాల్లో ప్రజలకు చెప్పాలన్నారు. ఇన్నాళ్లూ మొద్దు నిద్రలో ఉన్న ఆయన, ఇప్పుడు యువతను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎంపీగా గెలిచిన ఏం సాధించారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని సవాల్ చేశారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు.
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్న రేవంత్‌రెడ్డి, ప్రజలు దానిని కోరుకోవడం లేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కుట్రలు, కుతంత్రాలు, ఎమర్జెన్సీ, మతకల్లోలాలు సృష్టించడమేనా అని ప్రశ్నించారు. దేశంలో అందరూ రామరాజ్యమే కోరుకుంటారని, అది సీఎం కేసీఆర్ హయాంలో సాగుతున్నదన్నారు. రాష్ట్రంలో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరినీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చాయని ఇష్టం వచ్చినట్లుగా పథకాల హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మరోసారి బీఆర్ఎస్ గెలువడం ఖాయమని, సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని తాము ప్రజలకు చెబుతున్నామని, దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పి ప్రచారం చేయాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని, ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మూడోవసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఉద్యమ ఖిల్లా కరీంనగర్ బీఆర్ఎస్కు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల మహేశ్, గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.