గంగాధర, మార్చ్ 10 : సాగునీరు అందక గంగాధర మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి సాగు నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న ప్రతి ఎకరాకి రూ. 20 వేలు నష్టపరిహారం డిమాండ్ చేశారు. సోమవారం గంగాధర మండలం గర్శకుర్తిలో సాగునీరు లేక ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకొరగా వస్తున్న గోదావరి జలాలతో భూగర్భ జలాలు పడిపోయి చెరువులు, కుంటలు చుక్క నీరు లేకుండా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో రైతుల ఇబ్బంది పడకుండా 365 రోజులు పంటలకు సాగునీరు అందించినట్టు గుర్తు చేశారు.
ప్రస్తుతం కంటి తుడుపుగా 10 రోజులు మాత్రమే నీటిని విడుదల చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతుంటే పట్టించుకోరా అని రైతులు ఎమ్మెల్యే సత్యంను ప్రశ్నిస్తే అసహనంతో దబాయించండం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని, రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, రామిడి సురేందర్, మాజీ ఎంపీటీసీ తడిగొప్పుల రమేష్, నాయకులు మామిడిపల్లి అఖిల్, ఈర్ల మహిపాల్, గుంటుకు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.