కలెక్టరేట్, ఏప్రిల్ 29: జి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు జాబితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనుండగా, సజావుగా నిర్వహించేందుకు ఓటరు జాబితాలు స్పష్టంగా ఉండాలన్నారు. కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి చనిపోయిన, వలసవెళ్లిన ఓటర్ల వివరాలు తొలగించడంలో జాగ్రత్తగా ఉండాలని, మరణించిన వ్యక్తిని ధ్రువీకరించుకున్న అనంతరమే తొలగించాలన్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులను ధ్రువీకరించుకోవాలన్నారు.
బీఎల్వోలు సర్వేకు వెళ్లిన సమయంలో ఓటరు జాబితాలో ఉన్న వారు ఇంటి వద్ద లేకపోవడంతో వారిని వలసవెళ్లిన వారీగా భావించరాదని, వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా తెలియజేసిన అనంతరమే జాబితా నుంచి తొలగించాలన్నారు. తొలగించిన వారి వివరాలు తిరిగి నమోదు చేసేటప్పుడు ఖచ్చితమైన ధ్రువీకరణల ఆధారంగా తీసుకోవాలని, ఓటరుగా గుర్తింపు పొందిన వారందరికీ ఎపిక్ కార్డులు విధిగా పంపిణీ చేయాలన్నారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఓటరు జాబితాలు రూపొందించి, మే 15లోగా డెలిషన్ నివేదిక అందించాలన్నారు. ఒకే చిరునామాతో నమోదైన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, మార్పులు చేపట్టాలన్నారు.
డాటా ఎంట్రీలో ఏర్పడే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ప్రతి వారం వివిధ పార్టీల ప్రతినిధులతో పొలిటికల్ కో-ఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని, జాబితాలో చేపట్టిన సవరణలపై అభ్యంతరాలు స్వీకరించి, సమావేశానంతరం వివరాలు భద్రపరచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించరాదని, ప్రతివారం సీఈవో పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల అధికారి హమీద్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, డీఆర్డీవో శ్రీలత, ఆర్డీవోలు హరిసింగ్, ఆనంద్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.