KGBGV | శంకరపట్నం,ఆగస్టు23 : శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ ఘటనపై శనివారం ఎంఈవో నరసింహారెడ్డి విద్యాలయానికి వెళ్లి విచారణ నిర్వహించారు.
విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు ఎంఈవో వెల్లడించారు. ఘటనపై కేజీబీవీ ఎస్వో మాధవి వివరణ ఇస్తూ కేజీబీవీలో గత కొంతకాలంగా కిచెన్ రూమ్ స్టోర్ రూమ్లలో ఎలుకలు సంచరిస్తున్నాయని, ర్యాట్ గార్డ్ లు, బోనులు ఉపయోగించినా ఎలుకల బెడదను నివారించలేకపోతున్నామని, భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా గట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విచారణలో ఎంపీవో ప్రభాకర్, విద్యాలయ సిబ్బంది తదితరులున్నారు.