ఇల్లంతకుంట, మార్చి 15 : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రజా సమస్యలపై సమధానం చెప్పే సోయిలేదని, ప్రాజెక్టుల్లో పుషలంగా నీళ్లున్నా ఇప్పించే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రంగనాయక సాగర్ ఆర్డీ3 ఎల్ఎం6 కెనాల్‌ను పూర్తి చేయించాలని సూచించారు. నెల రోజుల్లోగా కిలోమీటర్ కాలువ పనులు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట తామే దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. కాలువ నిర్మాణం కోసం దీక్షలు చేస్తున్న రైతులను అవమాన పరిచేలా మాట్లాడడం సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కవ్వంపల్లి పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే బడితె పూజ చేస్తారని హెచ్చరించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు ఇల్లంతకుంట మండలం కరువు ప్రాంతమని, ఇకడి నుంచి ఎంతో మంది రైతులు భూములు పడావుపెట్టి వలస వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చిన మూడేళ్లలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించారని, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా వేలాది ఎకరాలకు గోదావరి జలాలు పారించారని చెప్పారు.
పంటలను కాపాడేందుకు ఎర్రటి ఎండల్లోనూ నీళ్లిచ్చారన్నారు. కానీ, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లున్నాయో తెలియదని, నీళ్లు ఎకడి నుంచి వస్తాయో కూడా తెలియదని, అసలు టీఎంసీ అంటే కూడా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కేసీఆర్ సర్కారు కట్టిన రిజర్వాయర్లు, కాలువలు ఎమ్మెల్యేకు, ఆయన వెంట తిరిగే నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కిలోమీటర్ కాలువ కోసం రైతులు ఉద్యమిస్తే అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే నిధులు తెస్తే రైతులకు సంఘీభావం ఎందుకు తెలుపలేదన్నారు. రైతులు 34 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహించారు. ఆయన అవగాహన లేకుండా భూసేకరణ జరగలేదని మాట్లాడుతున్నారని, భూసేకరణ చేయకుంటే 3.19 కోట్ల ఎస్టిమేషన్ ఎలా వేశారని అన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే మధ్యమానేరు, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఎలా వస్తున్నాయని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎల్ఎం6 కెనాల్ నిర్మాణం కోసం ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందని, అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో బోటిమీదపల్లి నుంచి పైపులైన్ వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నారు. పెద్దలింగాపూర్‌లో కొన్ని కుకలు ప్రోత్సహిస్తే రైతులు రిలేదీక్ష చేశారని ఎమ్మెల్యే కవ్వంపల్లి అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని సూచించారు. రైతులు టెంట్ వేసుకుంటే పోలీస్ బందోబస్తుతో కాన్వాయ్ ఆపకుండా పోయిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి చిత్తశుద్ధి లేదని, ఎమ్మెల్యే తన భాష తీరు మార్చుకోవాలని, చిల్లర బుద్ధి మానుకోవాలని హితవు పలికారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అలుగునూర్ ప్రజలు ఎమ్మెల్యేకు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇల్లంతకుంటకు 50 పడకల దవాఖాన తీసుకొచ్చానని, ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారంలోకి వచ్చి సిద్దిపేట-ఇల్లంతకుంట, జిల్లెల్ల-ఇల్లంతకుంట రోడ్లను రద్దు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచ్ రడం లక్ష్మి -ప్రవీణ్, మాజీ సర్పంచులు వెంకట్‌రెడ్డి, గోడిశెల జితేందర్, ఉడుతల వెంకన్న, కేతిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, బొల్లంవెంకన్న, మాజీ ఎంపీటీసీ సావనపల్లి అనిల్, మాజీ ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సాదుల్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాగటి రమేశ్, ఉపసర్పంచ్ చింటూ, మాజీ ఉపసర్పంచ్ కుమార్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కూనబోయిన రఘు తదితరులు పాల్గొన్నారు.