కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 2 : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకపోతే ఆయన చరిత్రను ఆధారాలతో బయటపెడుతానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేయకుండా ఎంత సేపూ బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
అభివృద్ధికి నిధులు తీసుకురావడం చేతకాకపోతే తనతో కలిసి ప్రభుత్వ పెద్దల వద్దకు రావాలని, తనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతో వారిని మెప్పించి నిధులు తెద్దామని సూచించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైతే తొక్కేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల్లో అడ్డగోలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నిలదీస్తారని, వీటిపై బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యేగా ఓర్పుగా సమాధానం చెప్పాలని సూచించారు. ప్రజలు నిలదీస్తే అది బీఆర్ఎస్ వాళ్లే చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాకముందే నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, అందులో కొనేవారు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన చెందారు.
కొనుగోళ్ల విషయంలో గుండ్లపల్లి వద్ద ఎమ్మెల్యేను రైతులు నిలదీశారని, వారి కడుపు మండి చెప్పులు విసిరేశారని, దీనిని కూడా తామే చేయించినట్టు ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. పింఛన్లు పెంచుతామని, మహిళలకు భరోసా ఇస్తామని చెప్పి అమలు చేయకుండా గ్రామాల్లోకి వెళ్తే వృద్ధులు ముళ్లు కర్రతో పొడుస్తారని, మహిళలు చీపుర్లతో తిరగబడుతారని హెచ్చరించారు.
ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ చేయకలేక అసహనంతో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అడ్డగోలుగా కమీషన్లు తీసుకొంటున్నారని, అందుకే ప్రజలంతా కమీషన్ల సత్యనారాయణ అని పిలుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా మంజూరు చేయించిన అభివృద్ధి పనులను ఎందుకు క్యాన్సిల్ చేయించారని ప్రశ్నించారు.
కమీషన్లు రావనే రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యాంపై బ్రిడ్జి కట్టడం కాదు, చేతనైతే గన్నేరువరం డబుల్‌రోడ్డు పనులను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. ఉన్నతచదువులు చదివి అనుచరులతో బూతులు తిట్టించడం పద్ధ తా? అని ప్రశ్నించారు.
ఆయనకు షాడో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తల్లి తనకు కొడుకులు అన్నం పెట్టటం లేదని కలెక్టర్‌కు విన్నవించుకున్నదని, అలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకున్న ఎమ్మెల్యే సం స్కారం ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, వెంకన్న, మహిపాల్, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.