Peddapally | పెద్దపల్లి, జనవరి20: ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వాహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రంజాన్ మాసం ఏర్పాట్లపై పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేశ్‌తో కలిసి ఆయన మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. హోటళ్లు 24 గంటలు నడిపేందుకు గల అవకాశాలను పోలీస్ శాఖ పరిశీలించి సూచనలు చేస్తుందని తెలిపారు. అనంతరం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలల, కళాశాలలో 2026 -2027 ప్రవేశాల పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పీ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.