మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తున్న జోయల్ డేవిస్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (ఫైల్)
Ramsagar Lake | మల్లాపూర్, జూన్ 22: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ పథకం పేరిట గ్రామాల్లోని చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంలో అప్పుడు పోలీస్ శాఖను సైతం స్వచ్చందంగా భాగస్వాములు చేశారు. దీంతో 2016లో ఏప్రిల్ మాసంలో అప్పటి మెట్పల్లి సీఐ వాసం సురేందర్, మల్లాపూర్ ఎస్ఐ షేక్ జానీపాషాలు కలిసి మండలంలోని రాఘవపేట గ్రామంలోని రాంసాగర్ కుంటను దత్తత తీసుకోని అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, అప్పటి జగిత్యాల డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్, అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, రైతుల సలహాలు, సూచనలు, సమిష్టి సహకారంతో ప్రత్యేక కమిటీ వేసి ప్రొక్లెయిన్, ట్రాక్టర్ల సహయంతో ఏండ్ల నుండి కుంగిన కట్ట మరమ్మతులు, పేరుకు పోయిన మట్టి పూడికతీత, పిచ్చి మొక్కల తోలగింపు, చెరువు పోడవునా కట్ట వెడల్పు తదితర అభివృద్ధి మరమ్మత్తు పనులను చేశారు. ఈ చెరువు అభివృద్ధి వల్ల ఆయా కట్టు కింద ఉన్న సూమారు 50 ఎకరాల వ్యవసాయభూములు సాగు నీరు అందడంతో పాటు, గ్రామంలోని పశువులకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండ మారింది. గతంలో మిషన్ కాకతీయ పథకం ముందు వేసవి కాలంలో చెరువులో చుక్క నీరు సైతం ఉండకపోయేది. ప్రసుత్తం ఈ చెరువు జలకళతో నిండు కుండలా దర్శనమిస్తుంది. దీంతో స్థానిక గ్రామస్థులు, అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.