Ramagundam | కోల్ సిటీ, జూలై 9 : రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. వేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, గోలివాడ చంద్రకళ, ఐత శివకుమార్ మాట్లాడుతూ గోదావరిఖని నగర ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రామగుండంకు అన్ని అర్హతలు, రవాణా సౌకర్యాలు ఉన్నప్పటికీ గోదావరిఖనికి దక్కాల్సిన జిల్లా కేంద్ర హోదా పెద్దపల్లికి వెళ్లిపోయిందనీ, అప్పట్లో రామగుండంను రెవెన్యూ డివిజన్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రధానంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 1.78 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారనీ, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, భూ ఆధారిత సేవలు తదితర పనుల కోసం దూరంగా రామగుండంలోని కార్యాలయంకు వెళ్లి రావల్సి వస్తుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు వ్యయ, ప్రయాసం తప్పడం లేదన్నారు. నియోజక వర్గంలో అత్యధిక జనాభ కలిగిన గోదావరిఖనిలో రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరరు. అలాగే రామగుండంను పూర్తి స్థాయి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం ద్వారా పరిపాలన వ్యవస్థ మరింత పటిష్టవంతం అవుతుదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో దుర్గం నగేష్, కొంకటి రవి, కంది సుజాత, సరిత, లక్ష్మీ, రమాదేవి, మండల శ్రీనివాస్, శిరీష, సుశీల, శారద, మల్లేశ్, శివతోపాటు తదితరులు పాల్గొన్నారు.