Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 13 : రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో సీనియర్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆశ్రఫ్ (50) హఠాన్మరణం చెందారు. ఈ సంఘటనతో తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి లోనయ్యారు. గోదావరిఖని శారదానగర్ లో నివాసం ఉండే ఆశ్రఫ్ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
గురువారం ఉదయం మృతదేహం వద్ద అధికారులు, తోటి ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. కాగా, గత 25 యేళ్లుగా రామగుండం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన ఉద్యోగి అకాల మృతి తీరని లోటుగా భావిస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఏలాంటి గైర్హాజరు లేకుండా పని చేస్తూ అధికారుల మన్ననలు పొందాడని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించేందుకు తీసుకెళ్లారు.