Ramagundam Baldia | కోల్ సిటీ, జూలై 12: రామగుండం నగర పాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిదంటూ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మాయం వెనుక మర్మమేమిటో..’ శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనాన్ని ఉటంకిస్తూ కార్పొరేషన్లోని అన్ని విభాగాల్లో అవినీతి పేరుకుపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు సైతం ఆ పోస్టులకు లైక్ లు కొడుతూ సమర్థించడం చర్చనీయాంశమైంది. అందులో ప్రధానంగా పెట్రోలు, డీజిల్ నెలకు సుమారు రూ.6 లక్షలపై చిలుకు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పారిశుధ్య విభాగంలో చీపుర్లు, బ్లీచింగ్, వాహనాల మరమ్మతులు, వాటి నిర్వహణ, కార్మికులకు కొబ్బరినూనె, బెల్లం, చెప్పులు, బట్టలు విషయంలో అవినీతి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించి రోడ్లు, డ్రైనేజీల పనుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాణ్యతను పరిశీలించకుండానే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఆధారంగా బిల్లులు చెల్లింపులో కమిషన్లు చేతులు మారుతున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో సైతం ఖర్చులకు సంబంధించి అధిక లెక్కలు చూపిస్తూ దండుకుంటున్నట్లు తెలిపారు.
ట్రేడ్ లైసెన్సు రూపంలో అకస్మాత్తుగా హోటళ్ల తనిఖీల్లో కూడా అమ్యామ్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇంటి నంబర్లు ఇస్తున్నారనీ, అన్నిటికి మించి కార్పొరేషన్లో ఏదైనా అభివృద్ధి పనులకు టెండర్ పిలిస్తే ముందుగా వాట్సాప్ గ్రూపులో పలానా కాంట్రాక్టర్ మాత్రమే ఆ పనులు తీసుకోవాలనీ, మిగతా ఎవరు కూడా టెండర్లు దాఖలు చేయవద్దంటూ హెచ్చరిస్తూ ప్రభుత్వంకు వచ్చే పర్సంటేజీలను కాంట్రాక్టర్లు అధికారులు కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
కార్పొరేషన్ పరిధిలోని చికెన్ వ్యర్థాలు అధికారుల సహకారంతోనే అక్రమార్కులు చేపల చెరువులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ విభాగంలోనూ అవినీతి మరకలు ఉన్నాయనీ, త్వరలోనే హైదరాబాద్లో విజిలెన్స్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు పోస్టులు పెట్టడం చర్చకు దారి తీసింది.