తెలంగాణ చౌక్ అక్టోబర్ 1: స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదని, మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన వికాస్ డిగ్రీ కళాశాల యూత్ ఫెస్టివల్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
దురదృష్టవశాత్తు 30ఏండ్లుగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావడంలేదన్నారు. గతంలో ఉన్నత విద్య పై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. రాజకీయాలపై అవగాహన పెంపొందించేందుకు ఇదే సరైన వయసు అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఇంటర్మీడియట్ నుంచి మొదలవుతుందని వివరించారు. డిగ్రీలో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రతి పదేండ్లకు ఒకసారి విద్యా పాలసీ రావాల్సిన నేపథ్యంలో 2014లో ఎంతో పోరాటం చేశామని, దాని ఫలితంగానే ఇటీవల నూతన విద్యావిధానంపై స్పష్టత వచ్చిందని చెప్పారు. విద్యావ్యవస్థకు మతం రంగు పూస్తూ కేంద్ర ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. విద్యార్థులు ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవాలని, ఇందుకు అవసరమైన టెక్నాలజీ తెలంగాణలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తరమైన ప్రణాళికతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని కొనియాడారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో రాజకీయాలపై విద్యార్థులు ఆసక్తి చూపేవారని, కానీ ఆ టైంలో నక్సల్ ప్రభావితం ఉండేదన్నారు. ఇప్పుడు ఆ వాతావరణం లేనందున నేటి తరం రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా వర్ధిల్లుతోందని వివరించారు. సిరిసిల్లలో ఇంజినీరింగ్, వ్యవసాయ డిగ్రీ, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలతో పాటు ఇటీవల మెడికల్ కాలేజీని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారని చెప్పారు.
భూగోళంలోనే తక్కువ భౌగోళిక ప్రాంతంగా ఉన్న రాష్ర్టాల్లో అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపిన మంత్రి కేటీఆర్‌ను మరోసారి ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్వి నాయకుడు జక్కుల నాగరాజు, సెస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన విద్యార్థులు