Thota Agaiah | సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 18: సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆది శ్రీనివాస్ తన అహంకార వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి తో కేటీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే జిల్లాలోని 117 స్థానాలలో 80కి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు.
అన్ని గ్రామాల్లో అధికార పార్టీ మద్దతు దారులకు గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గట్టి పోటీనిచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఓడిపోయిన చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో సంనవయంతో పని చేసి మొత్తం స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
అధికార పార్టీ నేతలు అధికార మదంతో అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ భవన్ ను జనతా గ్యారేజ్ తరహా లో ప్రజలకు అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారo కోసం నిత్యం అదుబాటులో ఉంటామన్నారు. రాబోవు జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు.
ఈ సమావేశంలో నాఫ్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగలపల్లి మండల అధ్యక్షుడు గజభింకార్ రాజన్న,సెస్ డైరెక్టర్ వర్ష కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, సత్తార్, తదితర నాయకులు పాల్గొన్నారు.