రైతులకు పంపిణీ చేసిన రాజన్న కోడెల స్థితిగతులను తెలుసుకునేందుకు అధికారయంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగింది. అందులో భాగంగానే పది ఉమ్మడి జిల్లాలకు ఇద్దరు అధికారుల చొప్పున నియమిస్తూ దేవాలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాలకు కేటాయించిన మొత్తం కోడెల వివరాలు సేకరించి, పూర్తిస్థాయి నివేదికను వారంలో ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత బిల్లులు సమర్పిస్తే.. నిబంధనల ప్రకారం టీఏ, డీఏలు చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొనగా.. వాహనాలు లేకుండా జిల్లాలు తిరగడం ఎలా సాధ్యమవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న కోడెల పంపిణీలో అక్రమాలు, కబేళాలకు తరలడం వంటి విషయాలను సీరియస్‌గా తీసుకున్న రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, తాజాగా దేవాలయ అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్రమాలు, పంపిణీ, ‘నమస్తే’ కథనాలపై ఆరా తీసి, అధికారులపై సీరియస్ అయినట్టు తెలిసింది. నిజానికి కోడెల పంపిణీ కమిటీకి అధ్యక్షుడైన తనకే తెలియకుండా మూడో దశ ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ నెల 7న ‘రాజన్న కోడెలు కోతకు!?’ శీర్షికన మొదలు పెట్టి.. ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురించింది.
ఈ కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మంత్రి కొండా సురేఖ సైతం స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పందించి, ఈ నెల 17న కలెక్టరేట్లో వేములవాడ ఆలయ, గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాజన్న దేవాలయం, గోశాలకు సంబంధించిన కోడెల పంపిణీకి కలెక్టర్ అనుమతి తప్పనిసరి ఉండాలని, అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పంపిణీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు 1,975 పశువులను గోశాల నుంచి పంపిణీ చేశామని, వీటిలో మొదటి దశ 1,278 కోడెలు, 75 ఆవులు, రెండో దశ 389 కోడెలు, 45 ఆవులు, మూడో దశ 188 కోడెలు పంపిణీ చేశామని అధికారులు వివరించారు. మొదటి, రెండు దశలకు మాత్రమే అనుమతి తీసుకున్నారని, మూడో దశ అనుమతి లేకుండా ఎలా పంపిణీ చేశారని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంపిణీ చేసిన 1,975 పశువుల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ మేరకు నివేదిక సమర్పించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రత్యేకాధికారుల నియామకం
కలెక్టర్ ఆదేశాలతో మొత్తం 1,975 కోడెల స్థితిగతులను పూర్తిగా పరిశీలించడానికి దేవాలయ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమిస్తూ దేవాలయ ఈవో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకాధికారితోపాటు ఒక అసిస్టెంట్‌ను నియమించారు. జూలై 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు రైతులకు ఉచితంగా పంపిణీ చేసిన కోడెల స్థితిగుతులు, సంరక్షణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి వివరాలు సేకరించి వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన టీఏ, డీఏ బిల్లులు సమర్పించిన తర్వాత నిబంధనలకు లోబడి చెల్లిస్తామని ఈవో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే, ముందుగా వాహనాలు లేకుండా ఎలా వెళ్తామని దేవాలయ అధికారులు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. కానీ, కలెక్టర్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే వెళ్లి క్షేత్రస్థాయి సర్వే చేయాలని మరికొంత మంది అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తున్నది.