Siricilla | సిరిసిల్ల రూరల్, జూన్ 14: ప్రజాపాలనలో నిరుపేదల అంత్యక్రియలు సైతం భారమవుతున్నది. సిరిసిల్లలో వీలినమైన గ్రామాలపై మున్సిపల్ అధికారుల తీరు, నిర్లక్ష్య ధోరణితో వీలీన గ్రామాల ప్రజలు చివరి మజిలీకి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిరిసిల్ల మున్సిపల్ 10 వ వార్డు పరిధిలో బత్తుల శంకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. కాగా అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్మశాన వాటిక లేకపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో గ్రామశివారులో అంత్యక్రియలు నిర్వహించారు.
మున్సిపల్టీకి చెందిన వైకుంఠ రథం కోసం సంప్రదించగా మరమ్మతులో ఉందని, రిపేరుచేసేవాళ్లు కూడ లేరని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల వరకు ఆ నలుగురి తోనే అంతిమయాత్ర నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. కాగా మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కౌన్సిలర్ నాగరాజుతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి స్మశానవాటికతోపాటు వీలీన గ్రామాల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.