రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారిణి, సిరిసిల్ల పట్టణానికి చెందిన గాలిపల్లి దత్తుబాయి (70) వడదెబ్బ(Sun Stroke)తో శుక్రవారం మరణించారు. గత నాలుగు రోజులుగా ఎండ తీవ్రతతో అవస్థలు పడిన దత్తుబాయి శుక్రవారం మధ్యాహ్నాం ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. దత్తుబాయి మృతి వార్త తెలిసి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
స్వరాష్ట్ర సాధన కోసం 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్‌పై అభిమానంతో గులాబీ పార్టీలో చేరిన దత్తుబాయి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.2009లో కేటీఆర్ సిరిసిల్లలో ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కేటీఆర్ వెంటనే నడిచింది. కేసీఆర్, కేటీఆర్‌లపై అభిమానంతో ఉద్యమంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.
మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న దత్తుబాయిని కేటీఆర్ సైతం ఆప్యాయంగా పలకరించేవారు. దత్తుబాయి భర్త రాజేశం ఏడేండ్ల క్రితం మృతిచెందారు. వీరికి సురేష్, మహేష్, రమేష్‌లు సంతానం కాగా.. రమేష్ నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు.