సిరిసిల్ల రూరల్, మార్చి 27: సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గురువారం ఉదయాన్నే వారి నివాసాలకు వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాట్ల మధు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొంతకాలంగా మాజీ సర్పంచులు పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళన చేసిన, ప్రభుత్వానికి విన్నవించిన మాజీ సర్పంచ్లను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చలో అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అక్రమ అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అక్రమ అరెస్టులు ఆపాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్టయినవారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి గనప శివజ్యోతి, కార్యవర్గ సభ్యులు కొయ్యాడ రమేష్, సురభి నవీన్ రావు ఉన్నారు. కాగా మాజీ సర్పంచ్ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ జడ్పీటీసీ కోడి అంత య్యతో పాటు పార్టీ నేతలు పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘీభావం తెలిపారు.