రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 14 : డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET app) యాప్లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారంసమీకృత జిల్లా కలెక్టరేట్లో డీఈఈటీ యాప్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయని, నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని తెలిపారు.
ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన విద్యార్థులు డీఈఈటీలో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగు అవుతాయని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఐటిఐ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరాలను 15 రోజులలో డీఈఈటీలో నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర ఉపాధి కోర్సుల కళాశాలలో, ఎంబీఏ కాలేజీ విద్యార్థులు కూడా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేట్ రంగంలోనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ లో అర్హత కలిగిన ఉద్యోగాల వివరాలు కూడా విద్యార్థులకు చేరవేసేందుకుడీఈఈటీ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో జి.ఎం. ఇండస్ట్రీ హనుమంతు, సంబంధిత ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.