సిరిసిల్ల రూరల్, మార్చి 18: ఉస్మానియా యూనివర్శిటీ సామాజిక ప్రజా ఉద్యమాల వేదిక అని, అలాంటి వేదికలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయమని బీఆర్ఎస్వీ(BRSV leaders) రాష్ట్ర నేత చీమల ప్రశాంత్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన బీఆర్ఎస్వీ నేతలను తంగళ్ళపల్లి పోలీసులు తెల్లవారు జామున ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు.
విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని రద్దు చేసేందుకు ప్రయత్ని స్తున్నారని మండిపడ్డారు. 100 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిర్బంధాలను కొనసాగించలేదన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి లాగ ఎవరు నిర్భందాలను విధించలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ప్రోగ్రాంలకు అనుమతులు అవసరం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్టలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ అయిన వారిలో బొలవేని ఎల్లం యాదవ్, పొన్నాల చక్రపాణి, సయ్యద్ ఆఫ్రోజ్, భాస్కర్, తదితరులు ఉన్నారు.