రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ప్రజాఆశీర్వాదం కోరుతూ నిర్వహించిన కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో నయాజోష్ నింపింది. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలంతా రంగంలోకి దిగారు. నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాలుగుసార్లు గెలిచి ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రిగా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపిన రామన్నను ఐదోసారి గెలిపించాలన్న పట్టుదలతో ముందుకుపోతున్నారు. కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని వివరిస్తూ.. కార్యకర్తలు, నాయకులు పల్లెపల్లెలో గడపగడపకూ వెళ్తున్నారు. ఎన్నికల ప్రచార రథాలతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంపై దిశానిర్దేశం
సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావుతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. పార్టీ నూతన భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులంతా కార్యకర్తలు, నాయకులకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. తెల్లవారే ప్రజాఆశీర్వాదం కోరుతూ నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు ఊహించని విధంగా జనం రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిం పింది.
అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం అధ్యంతం ఆకట్టుకున్నది. సిరిసిల్లను సోలాపూర్‌గా తీర్చిదిద్దుతామని హామీఇచ్చారు. భవిష్యత్తులో విద్యాకేంద్రంగా విరాజిల్లుతుందని చెప్పడంతో కార్మిక క్షేత్ర ప్రజలకు భరోసానిచ్చింది. రామ న్న మార్గదర్శకంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జింద కళ, ఆర్బీఎస్ కన్వీనర్ గడ్డం నర్సయ్య, ముస్తాబాద్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఎంపీపీ శరత్‌రావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సీనియర్ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్‌తోపాటు అన్ని మండలాల అధ్యక్షలు, కార్యవర్గాలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్లలో సిరిసిల్లకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుపుతూ కరపత్రాలను ముద్రించారు. వాటిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు.
అన్నివర్గాల మద్దతు రామన్నకే..
జిల్లా ప్రదాత కేటీఆర్‌కు ఈ ఎన్నికల్లో అన్నివర్గాల నుం చి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే పలు కులసంఘాలు, అసోసియేషన్లు తీర్మానాలు చేశాయి. తంగళ్లపల్లి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సుమారు 600మంది మద్దతు ప్రకటించారు. నామినేషన్ ఫీజుకు సైతం రూ.10,116 అం దించి రామన్నపై అభిమానం చాటుకున్నారు. సోమవారం సీఎం సమక్షంలో 18కుల సంఘాలు, నాలుగు అసోసియేషన్లు మద్దతు తెలిపాయి.
జనంలోకి చల్మెడ..
వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలిసి అప్యాయంగా పలుకరిస్తున్నారు. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వేములవాడలోని నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమమై, వారికి దిశానిర్దేశం చేసి జోష్పెంచారు. కార్యకర్తలు సంఘటితంగా కలిసి చల్మెడ గెలుపు కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, ఏశ వాణి, ఎంపీపీలు వజ్రమ్మ, బండ మల్లేశంయాదవ్, చంద్రయ్యగౌడ్, బైరగోని లావణ్య, గంగం స్వరూపారాణి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్యయాదవ్, అన్ని మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు.