Siricilla : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ తెలిపారు. సిరిసిల్లకు వస్తున్న మంత్రిని కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతామని, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి వినతి పత్రం అందిస్తామని వారు వెల్లడించారు.
మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముశం రమేష్, కోడం రమణ మాట్లాడుతూ.. సిరిసిల్లలో నెలకున్న ప్రధాన సమస్యలను వివరిస్తూ.. చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తిచేసి కార్మికులకు అందించాలి. త్రిఫ్టు పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. ఇందిరమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులందరికీ అందించాలి. టెక్స్టైల్ పార్క్లో విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి.
ఎన్ఓసి సర్టిఫికెట్లు ఇవ్వాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి చేయూత అందించి మూతబడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. సిరిసిల్లలోని పవర్లూమ్ పరిశ్రమ కు విధించిన విధించిన అదనపు విద్యుత్ చార్జీలు 40 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేసిన వస్త్రాల బకాయి బిల్లులను వెంటనే అందించాలి. 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి ఇతర రాష్ట్రాల కార్మికులకు రావలసిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులను వెంటనే అందించాలి’ అని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్ చేశారు.