సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని 17 వ పోలీస్ బేటాలియన్ ఎంఐ. సురేశ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే- Police Martyrs day) సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్లోని 17 వ బెటాలియన్ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ 1959లో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటి శక్తుల్ని ఎదుర్కొంటూ ఎందరో పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నామన్నారు. పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జె. జగదీశ్వర రావు,ఎస్. సురేష్ , ఆర్ఐలు కుమారస్వామి, శ్యాంప్రసాద్, ఆర్ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.