వేములవాడ : రాజన్న సన్నిధికి వచ్చే భక్తులను సిరిసిల్ల జిల్లా పోలీసులు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తులకు సైబర్ నేరాల పట్ల జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల బృందం రాజు, శ్రీకాంత్ బ్లూ కోట్ పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నంబర్ల నుండి బహుమతులు వచ్చాయని, నగదు ప్రైజ్ మనీ గెలుచుకున్నారని ఇలా అనేక రకాలుగా మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపి ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీరు ఎంపికయ్యారని సంబంధిత వివరాలు తెలపాలని కూడా మోసానికి పాల్పడుతున్నట్లు వివరించారు. ఇలా ఎవరైనా గుర్తు తెలియని నెంబర్ల ద్వారా ఫోన్కు సందేశాలు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు లావాదేవీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికి చెప్పొద్దన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు.