వేములవాడ, జూన్ 17: గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడించారు. వేములవాడ పట్టణం తెలంగాణ చౌక్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లిన కార్మికులు ఎమ్మెల్యే నివాసం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లారెడ్డి, రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా గ్రీన్ ఛానల్ ద్వారా 50 కోట్ల రూపాయలను విడుదల చేసి కార్మికులకు నేరుగా వేతనాలు అందించాలన్నారు. ప్రతి కార్మికునికి 26వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి రెండవ పీర్సీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, గణేష్, సంఘం నాయకులు అంజయ్య, మల్లయ్య, రవీందర్, శ్రీనివాస్, నరేష్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.